న్యూస్‌రీల్
గురువారం శ్రీ 1 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
పైసలివ్వం!
కందుకూరు: పరిహారం తగ్గించేందుకు అధికారులు కుట్ర చేస్తున్నారని ఫ్యూచర్ సిటీ రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ముందస్తుగా పేర్కొన్న ప్రకారం డబ్బులు చెల్లించాలని, లేదంటే ఆందోళన తప్పదని పేర్కొంటున్నారు. సాధారణంగా ప్రభుత్వం ఎక్కడ భూసేకరణ చేపట్టినా రైతులకు సంబంధించిన మొత్తం విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకుని పరిహారం చెల్లిస్తుంది. ఇందులో ఉండే బోర్లు, బావులు, షెడ్లు, చెట్లకు లెక్కగట్టి అదనంగా అందజేస్తుంది. కానీ ఇక్కడ మాత్రం రాళ్లు, రప్పల పేరుతో పరిహారం తగ్గించేలా అధికారులు వ్యవహరిస్తుండటం గమనార్హం. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇది ఫ్యూచర్ సిటీలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన భూసేకరణలో రైతులకు నెలకొంటోన్న సమస్య.
233 ఎకరాల్లో..
కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట రెవెన్యూ సర్వే నంబర్ 121 నుంచి 146 వరకు మరియు 148లో దాదాపు 233.28 ఎకరాల భూమిని ఫ్యూచర్‌సిటీ కోసం సేకరిస్తున్నట్లు మార్చి నెల 3న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది జరిగి దాదాపు ఏడు నెలలు కావస్తోంది. కాగా, ఈ భూమి పురానాపూల్‌లోని దేవల్ శివాజీ పేరుతో ఉంది. వందేళ్లకు పైగా బేగరికంచెకు చెందిన రైతులు ఈ భూములను సాగు చేసుకుంటున్నారు. గ్రామం కూడా ఇదే సర్వే నంబర్లలోనే ఉంది. నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం రైతులతో పరిహారం విషయమై అవగాహన కొచ్చింది. ఎకరాకు రూ.70 లక్షల చొప్పున అంగీకరించి సగం రైతులకు, మరో సగం ఆలయానికి చెందేలా అధికారులు, రైతుల మధ్య అంగీకారం కుదిరింది. బాధితులకు పరిహారంతో పాటు ఎకరాకు 121 గజాల ప్లాటు కేటాయించేందుకు ఇరువర్గాల మధ్య డీల్ కుదిరింది.
ఎంజాయ్‌మెంట్ సర్వే పేరుతో..
రైతులు సాగు చేసున్న భూముల్లో అధికారులు ఎంజాయ్‌మెంట్ సర్వే చేపట్టారు. ఇక్కడే సమస్య వచ్చింది. భూముల్లో అక్కడక్కడ బండ రాళ్లు ఉండటంతో వాటికి పరిహారం చెల్లించబోమని చెబుతుండటంతో నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ లేదా అసైన్డ్ భూములకు ఆ విధంగా చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. ప్రభుత్వానికి సంబంధం లేని భూమిలో కూడా రాళ్లు, రప్పలు ఉన్నాయని పరిహారం తగ్గించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈవిషయమై అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమకు పూర్తిగా పరిహారం అందితేనే భూములు ఇస్తామని, లేకపోతే రాళ్లు ఉన్న చోట భూమిని వదిలిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.
అధికారుల నిర్ణయంపై
బాధితుల ఆందోళన
మొత్తం విస్తీర్ణాన్ని లెక్కగట్టాలని ఫ్యూచర్ సిటీ నిర్వాసితుల డిమాండ్
పరిహారం తగ్గింపు సరికాదని మండిపాటు


