కొడంగల్ రూరల్/బొంరాస్‌పేట: పోలీస్ స్టేషన్ల భవన నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ఎక్కడా రాజీ పడొద్దని లా అండ్ ఆర్డర్ డీజీపీ మహేశ్ భగవత్ సూచించారు. బుధవారం ఎస్పీ స్నేహమెహ్రతో కలిసి కొడంగల్, బొంరాస్‌పేట, దుద్యాల్‌లో నిర్మాణ దశలో ఉన్న భవనాలను పరిశీలించారు. కొడంగల్ పట్టణంలో రూ.2.14కోట్లతో పోలీస్ స్టేషన్, రూ.56 లక్షలతో సీఐ కార్యాలయం నిర్మిస్తున్నట్లు తెలిపారు. బొంరాస్‌పేటలో రూ.3 కోట్లతో నిర్మిస్తున్న భవనాన్ని పరిశీలించారు. దుద్యాల్‌లో భవన నిర్మాణ పనులను పరిశీలించి అక్టోబర్ 10వ తేదీ నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు ఎస్పీ రాజేష్ మీనన్, డీఎస్పీ శ్రీనివాస్, సీఐ చంద్రశేఖర్, కొడంగల్, బొంరాస్‌పేట, దుద్యాల్ ఎస్‌ఐలు సత్యనారాయణ, బాల వెంకటరమణ, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.


