షాద్‌నగర్: అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని అదనపు కలెక్టర్ కిరణ్మయి సూచించారు. బుధవారం నందిగామలోని అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టిక విలువలతో కూడిన ఆహారం, మెరుగైన వాతావరణంలో విద్యను అందించాలని సిబ్బందికి సూచించారు. నిరుపేద విద్యార్థులు అభ్యసించే ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అందరూ కృషి చేయాలన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, రోగులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. విధి నిర్వాహణలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని తెలిపారు.
కొత్తూరు: ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫామ్‌లను సరైన కొలతలతో కుట్టాలని మోప్మా అడిషనల్ మిషన్ డైరెక్టర్ యాదగిరిరావు సూచించారు. కొత్తూరు పట్టణంలోని ఉన్నత పాఠశాలను బుధవారం ఆయన సందర్శించారు. యూనిఫామ్స్ ధరించిన పలువురు విద్యార్థులతో మాట్లాడి సరైన కొలతలతో ఉన్నాయా.. ఓవర్ సైజు, చిన్నగా ఉన్నాయా..? అనే విషయాలను తెలుసుకున్నారు. ఇంకా యూనిఫామ్స్ కుట్టని కాంట్రాక్టర్లు సరైన కొలతలతో కుట్టడంతో పాటు ఇప్పటికే కుట్టిన దుస్తుల్లో లోపాలు ఉంటే సరిచేసి పంపిణీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మోప్మా జిల్లా పీడీ వెంకటనారాయణ, కొత్తూరు మున్సిపల్ కమిషనర్ సాహితీరెడ్డి, జిల్లా మిషన్ కోఆర్డినేటర్ అశోక్, హెచ్‌ఎం అంగూర్‌నాయక్, సీఆర్పీలు, తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం రూరల్: ట్రాఫిక్ పోలీసులు సమర్థవంతంగా పని చేయడానికి వారికి అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని ఫ్యూచర్ సిటీ జాయింట్ పోలీస్ కమిషనర్ చందనా దీప్తి పేర్కొన్నారు. బుధవారం కమిషనరేట్ కార్యాలయం వినోభానగర్‌లో ట్రాఫిక్ సిబ్బందికి మెడికల్ కిట్లు అందజేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ శివం, పోలీసులు పాల్గొన్నారు.
కొందుర్గు: దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చూడాలని అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి సూచించారు. బుధవారం ఆయన కొందుర్గు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. భూభారతి, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆజామ్‌అలీ, డిప్యూటీ తహసీల్దార్ నివేదితరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
యాచారం: మొండిగౌరెల్లిలో అసైన్డ్ భూముల సేకరణ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. సర్వేనంబర్లు 19, 68, 127లోని కబ్జా రైతుల జాబితాను బుధవారం సాయంత్రం ఆరు గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అతికించారు. ఇందులో ఏవైనా అభ్యంతరాలుంటే గురు, శుక్రవారాల్లో పంచాయతీ కార్యాలయం లేదా తహసీల్ ఆఫీసులో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇదిలా ఉండగా రైతులు సహకరిస్తే పదిహేను రోజుల్లో పరిహారం చెక్కులు అందజేస్తామని ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.


