అధునాతన వసతులతో బస్టాండ్
కొడంగల్: కొడంగల్‌లో ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అత్యాధునిక సౌకర్యాలతో అన్ని వసతులతో నిర్మాణం చేపట్టనున్నారు. ఇందు కోసం ప్రభుత్వం రూ.16,64,11,689 మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మాణ బాధ్యతను ఆర్‌అండ్‌బీ శాఖకు అప్పగించారు. టెక్నికల్, టెండర్ ప్రాసెస్, నిర్మాణ పర్యవేక్షణ, పరిశీలన బాధ్యతలు, ఆర్కిటెక్ డిజైన్ తదితర పనులు రోడ్లు భవనాల శాఖ పర్యవేక్షణలో జరుగుతాయని ఆదేశాలు ఇచ్చారు. ఎన్నో ఏండ్లుగా విస్తరణకు నోచుకొని కొడంగల్ బస్టాండ్‌ను కార్పొరేట్ స్థాయిలో నిర్మిస్తారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తిరుపతిరెడ్డి వినతి మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కొడంగల్‌తో పాటు కోస్గి, మద్దూరు బస్టాండ్‌లను కూడా నిధులు మంజూరు చేశారు. కోస్గి బస్టాండ్‌కు రూ.17 కోట్ల 40 లక్షలు, మద్దూరుకు రూ.7 కోట్ల 79 లక్షలు ఇచ్చారు. ప్రయాణికులకు మెరుగైన రవాణాతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సిద్ధమైంది. బస్సు సర్వీసులకు పరిమితం కాకుండా వ్యాపారం, వినోదం ఒకే చోట లభించేలా ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిస్ట్ సిస్టం విధానంలో మోడల్ బస్టాండ్లను నిర్మించనున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం షాపింగ్ కాంప్లెక్స్, గేమింగ్ జోన్లు, హోటల్స్, ఎంటర్ టైన్‌మెంట్ పార్కులు ఏర్పాటు చేయనున్నారు.
ఊర్లో కాంప్లెక్స్.. ఊరిబయట బస్టాండ్?
కొడంగల్‌లో ప్రస్తుతం బస్టాండ్ ఉన్న ప్రాంతంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మించనున్నారు. ఇందు కోసం రూ.16 కోట్లా 64 లక్షలు మంజూరు చేశారు. బస్టాండ్ ప్రాంగణాన్ని మాత్రం కొడంగల్ శివారులో హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన గాడిబాయి శివాలయం దారిలో నిర్మించనున్నట్లు సమాచారం. కొత్త బస్టాండ్ నిర్మాణం కోసం స్థల పరిశీలన చేస్తున్నట్లు తెలిసింది. కొడంగల్ – హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన ప్రభుత్వ అసైన్డ్ భూమిలో బస్టాండ్ నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహబూబ్‌నగర్, హైదరాబాద్, తాండూరు వెళ్లే జాతీయ రహదారులను కలుపుతూ పట్టణ శివారులో బైపాస్ నిర్మిస్తున్నారు. ఈ బైపాస్‌కు కొద్ది దూరంలో ఊరు బయట బస్టాండ్ నిర్మిస్తే బస్సుల రాకపోకలకు కూడా ఇబ్బంది ఉండదని భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రణాళికలు చేస్తున్నారు. ఊరు బయట బస్టాండ్ నిర్మిస్తే భవిష్యత్తులో పట్టణ విస్తీర్ణం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొడంగల్ చుట్టూ నాలుగు వైపులా నాలుగు కిలోమీటర్ల దూరంలో రింగ్ రోడ్డు నిర్మాణం చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేడియల్ రోడ్డు శంషాబాద్ నుంచి లగచర్ల మీదుగా కొడంగల్ సరిహద్దు వరకు వస్తోంది. ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్తులో కొడంగల్ రూపరేఖలు మారబోతున్నాయి.
కొత్త బస్టాండ్ నమూనా చిత్రం
నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం
రూ.17 కోట్లకు పరిపాలనా అనుమతులు
హర్షం వ్యక్తం చేసిన పట్టణవాసులు


