కొత్తూరు: మానసికస్థితి సరిగ్గా లేని ఓ మహిళ తన ఆరు నెలల కూతురుతో కలిసి అదృశ్యమైంది. ఈ సంఘటన మండలంలోని ఎస్‌బీపల్లి గ్రామంలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. సీఐ నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన దండు మాధవి (23), బాల్‌రాజు భార్యాభర్తలు. వీరికి కూతురు శైలజ (ఆరు నెలలు) ఉంది. కొన్నిరోజులుగా మానసిక స్థితి సరిగ్గా లేని మాధవి భర్త కూలీ పనులకు వెళ్లగానే కూతురుతో కొత్తూరు వచ్చి భిక్షాటన చేస్తుండేది. ఈ నెల 18న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుదాఘాతంతో
పాడి ఆవు మృతి
ఆమనగల్లు: విద్యుదాఘాతంతో పాడి ఆవు మృత్యువాత పడింది. మున్సిపల్ పరిధిలోని జంగారెడ్డిపల్లికి చెందిన రైతు పాపయ్యకు చెందిన ఆవు మేత మేస్తూ ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లింది. ఈ సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్‌ఘాతంతో అక్కడికక్కడే మృతి చెందింది. రూ.60 వేలు విలువైన ఆవు మృతి చెందిందని ప్రభుత్వమే తనను ఆదుకోవాలని రైతు కోరాడు.


