తుక్కుగూడ: బీఆర్‌ఎస్ అంటేనే దళిత వ్యతిరేక పార్టీ అని అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ విమర్శించారు. తుక్కుగూడ ఔటర్ సర్కిల్ వద్ద శనివారం జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ క్యారగారి శ్రీధర్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అసెంబ్లీలో స్పీకర్ ప్రసాద్‌కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అత్యంత హేయంగా వ్యాఖ్యలు చేశారని అన్నారు. రాజ్యంగబద్ధమైన పదవిలో ఉన్న దళిత బిడ్డను అవమానించిన ఘటనపై పశ్చాత్తాపం వ్యక్తం చేయాల్సింది పోయి, ఫామ్‌హౌస్ సమీపంలో దళితులు నిరసన చేసిన ప్రదేశాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడం దారుణమైన చర్యగా అభివర్ణించారు. దీనిని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు సమర్థిస్తారా అని నిలదీశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కేఎల్లార్, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఏనుగు జంగారెడ్డి, పీసీసీ సభ్యుడు దేప భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


