ఇబ్రహీంపట్నం రూరల్: విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి సూచించారు. బుధవారం ఆమె మండల పరిధిలోని ఉప్పరిగూడ ప్రీప్రైమరీ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు బోధిస్తున్న తీరును తెలుసుకున్నారు. పౌష్టికాహార పంపిణీపై అంగన్‌వాడీ టీచర్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందజేస్తున్న ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లల సంఖ్య పెంచేలా కృషి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జాతీయ పోషణ అభియాన్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలను సందర్శించి ఐదవ తరగతిలో కూర్చుని పాఠాలు విన్నారు. టీచర్ సపోర్టు గ్రూపులుగా విభజించి వారికి అర్థమయ్యే రీతిలో బోధించాలని చెప్పారు. వర్ణమాల, గుణింతాలు రాని మూడు, నాలుగు, ఐదవ తరగతి విద్యార్థులను కేటగిరీలుగా విభజించి టైం టేబుల్ ఏర్పాటు చేసి పాఠాలు చెప్పాలన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం సక్రమంగా అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీవేణి, ఎంఈఓ హీర్యానాయక్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ వినితాదేవి, హెచ్‌ఎం వీకే లక్ష్మీ, టీఆర్‌పీ రంగారెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు .
అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి


