● రాష్ట్ర రాజకీయాల్లో మార్మోగుతున్న నియోజకవర్గ పేరు
● కేసీఆర్‌పై హాట్ కామెంట్లు, అసెంబ్లీ వద్ద నిరసనలో దూకుడుగా ప్రవర్తించి వార్తల్లో నిలిచిన ఎమ్మెల్యే వీర్లపల్లి, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి
● రసవత్తర రాజకీయ చరిత్రలో షాద్‌నగర్
షాద్‌నగర్: షాద్‌నగర్ నియోజకవర్గానికి ఆది నుంచే ప్రత్యేక చరిత్ర ఉంది. తాజా రాకీయ పరిణామాలతో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మారో మారు రాష్ట్ర వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. రెండు ప్రధాన పార్టీలకు చెందిన ఇద్దరు నేతల దూకుడు ఈ రాజకీయ చర్చలకు కారణమైంది. ఒకరు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కాగా.. మరొకరు ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్‌కుమార్‌రెడ్డి. ఈ ఇద్దరు నాయకుల పోకడలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేశాయి.
వీర్లపల్లి నోట.. కేసీఆర్ మాట..
ఈ మాట చిన్నదే అయినప్పటికీ పెద్ద ఎత్తున ప్రభావం చూపింది. ఓ మీడియా చానెల్‌తో మాట్లాడుతూ.. ‘కేసీఆర్ చావును కోరుకుంటున్నామంటూ’షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడడం వివాదాస్పదమై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఈ మాటలకు ఉలిక్కిపడిన బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగింది. నేతలు సైతం ఎమ్మెల్యేను ఇష్టారాజ్యంగా దూషించారు. అయితే చివరికి ఈ అంశం అధిష్టానాన్ని సైతం ఆశ్చర్యానికి గురి చేయడంతో సాక్షాత్తు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ స్పందించారు. ముఖ్యంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి బీఆర్‌ఎస్ నేతలు పిండప్రదానం చేయడంతో ఎమ్మెల్యేకు కోపం వచ్చిదంటూ చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కూడ తాను ఫ్లోలో అలా మాట్లాడానని.. ఒకరి చావు కోరడం ఏమాత్రం సమర్థనీయం కాదంటూ మీడియాకు ఓ వీడియోను రిలీజ్ చేశారు. అయితే గతంలో రాహుల్ గాంధీ ఎక్కడ సచ్చిండు అంటూ కేటీఆర్ చేసిన కామెంట్ల వీడియోలు ఎమ్మెల్యే ప్రదర్శించారు. ఏది ఏమైనా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడిన మాటలు సంచలనానికి దారి తీసింది.
‘నవీన’పోకడలు
రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకునేందుకు నియోజకవర్గ నాయకుడు ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్‌కుమార్‌రెడ్డి ముందుకెళ్తున్నారు. అసెంబ్లీ వద్ద జరిగిన ఆందోళనలో నవీన్‌రెడ్డి పాత్ర అందరికి తెలిసిందే. స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అతను చేసిన వ్యాఖ్యలు, పోలీసులపై అతను వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ సోషల్ మీడియా విమర్శలు గుప్పించింది. షాద్‌నగర్‌లో కాంగ్రెస్ నేతలు ఆయన దిష్టిబొమ్మలను దహనం చేశారు. స్పీకర్‌ను దూషించిన కేసులో ఎమ్మెల్సీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడం అరెస్టులు, శాసన మండలిలో సస్పెండ్ చేయడం లాంటి సంఘటనలతో ఒక్కసారి నవీన్‌రెడ్డి వార్తల్లోకి ఎక్కాడు. గతంలో ఆయన ఎమ్మెల్యేను, మాజీ ఎమ్మెల్యేను విమర్శించడం వివాదాస్పదం కావడం, ఇప్పుడు తన వ్యాఖ్యలతో మరోమారు వార్తల్లో నిలిచాడు.
నాగర్‌కుంట నవీన్‌రెడ్డి, ఎమ్మెల్సీ
వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్యే, షాద్‌నగర్
అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చోటు చేసుకున్న రాజకీయంలో ఇరువురూ నియోజకవర్గ నేతలే ఉండడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న శంకర్‌రావు సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేసి సంచలనంగా మారి వివాదాస్పదమయ్యాయి. అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎర్రచందనం స్మగ్లర్ అంటూ కామెంట్ చేయడం, సబితారెడ్డికి మంత్రి పదవి ఇచ్చిన సమయంలో సీనియర్‌ను పక్కకు పెట్టి ఆమెకు ఎలా ఇస్తారంటూ చేసిన వాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఇలా ఎప్పటికప్పుడు ఏదో ఒక రాజకీయ వేడితో షాద్‌నగర్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చల్లో నిలుస్తుంది.


