ప్రకృతి వ్యవసాయమే మేలు | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి వ్యవసాయమే మేలు

Sep 10 2026 8:41 AM | Updated on Sep 10 2026 8:41 AM

ఆకట్టుకున్న స్టాల్స్‌

వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి

కలెక్టరేట్‌లో కిసాన్‌ మేళాకు విశేష స్పందన

ఇబ్రహీంపట్నం రూరల్‌: రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ ముదిరెడ్డి కోదండరెడ్డి సూచించారు. బుధవారం జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆత్మ సౌజన్యంతో కొంగరకలాన్‌లోని ఐడీఓసీలో జిల్లా స్థాయి కిసాన్‌మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు పంటల వైవిధ్యీకరణ, ప్రత్యామ్నాయ పంటలు, సుస్థిర వ్యవసాయం, ఆధునిక వ్యవసాయ సాంకేతికలు, వివిధ వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించారు . ఈ సందర్భంగా ముదిరెడ్డి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వ్యవసాయ అనుబంధ శాఖలు అమలు చేస్తున్న అన్ని పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా వరి సాగు తగ్గించి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేపట్టాలని సూచించారు. సుస్థిర, లాభదాయక వ్యవసాయాన్ని ప్రోత్సాహిస్తామన్నారు. అనంతరం కొహెడ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చిలుక మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన కొహెడ మార్కెట్‌ నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత ఆధునికతతో రూపుదిద్దుకుంటుందని, త్వరలోనే రైతులకు అందుబాటులోకి వస్తుందన్నారు. అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ కిరణ్మయి మాట్లాడుతూ.. రైతులకు భూసార పరీక్షపై అవగాహన అవసరం అని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ పీడీ మధుమోహన్‌, కేవీకే హయత్‌నగర్‌ శాస్త్రవేత్తలు పంటల వైవీధ్యీకరణ, ప్రత్యామ్నాయ పంటలపై సాంకేతిక సూచనలు అందించారు.

కిసాన్‌ మేళాలో ఉద్యాన, పట్టు పరిశ్రమ, మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ అధికారులు రైతుల ఆధునిక సాంకేతి పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునేలా 15 స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. అతిథులు స్టాల్స్‌ను పరిశీలించారు. భూసార పరీక్షలపై కొంగరకలాన్‌ పాఠశాల విద్యార్థులు రైతులకు అవగాహన కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement