మొయినాబాద్: గణేశ్ ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని చేవెళ్ల డీసీపీ యోగేష్‌గౌతం అన్నారు. మొయినాబాద్ మున్సిపల్ కేంద్రంలోని అంజనాదేవి గార్డెన్‌లో బుధవారం గణేష్ ఉత్సవ కమిటీలు, గణేశ్ విగ్రహాల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండపం ఏర్పాటు చేసే ప్రదేశం, విగ్రహం ఎత్తు, నిమజ్జనం చేసే తేదీ, ప్రదేశం తదితర వివరాలను పోలీస్ ప్రొటోకాల్ వెబ్‌సైట్‌లో నమోదు చేసి అనుముతు తీసుకోవాలన్నారు. ఉత్సవాల్లో శబ్ద కాలుష్యం లేకుండా నిబంధనలను పాటించాలన్నారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా డీజే సౌండ్‌లు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గణేశ్ మండపాల్లో అగ్ని, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగిన భద్రతా చర్యలను పాటించాలని సూచించారు. మత సామరస్యాన్ని కాపాడుతూ ఊరేగింపులు నిర్వహించాలని తెలిపారు. ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఊరేగింపులు, నిమజ్జనం సమయంలో పోలీసుల సూచనలు పాటించి, సహకరించాలన్నారు. ఎవైనా అనుమానాస్పద కార్యకలాపాలు, అవాంఛనీయ ఘటనలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సమావేశంలో ఏసీపీ కిషన్, ఇన్‌స్పెక్టర్ మల్లికార్జున్‌రెడ్డి, శంషాబాద్, చేవెళ్ల, శంకర్‌పల్లి ఎస్‌హెచ్‌ఓలు, ఎస్సైలు, గణేష్ మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
గణేశ్ ఉత్సవ కమిటీలకు డీసీపీ యోగేష్‌గౌతం సూచన
ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని పిలుపు
డీజేలు పెడితే చర్యలు తప్పవని హెచ్చరిక
ర్యాలీలతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించొద్దని వెల్లడి


