పరిగి: డబ్బులు అడిగినందుకు ఓ వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటన పరిగి మున్సిపల్ పరిధిలోని నస్కల్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై మోహనకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గౌస్, నందు మిత్రులు. సెంట్రింగ్ పనులు కలిసి, విడిగా చేస్తుంటారు. ఇటీవల నందు వికారాబాద్‌లో ఓ సెంట్రింగ్ పనిని గుత్తకు తీసుకున్నాడు. పని సక్రమంగా చేయకపోవడంతో నిర్వాహకులు గౌస్‌కు అప్పగించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. పాత బకాయి, ఎన్నెపల్లిలో పని చేసిన డబ్బులు ఇవ్వాలని గౌస్ నిత్యం నందును అడగ సాగాడు. గతంలో ఇద్దరు కలిసి కొన్ని పనులు చేయగా అందులో గౌస్ లెక్క తేలాల్సి ఉందని గ్రామస్తులు తెలిపారు. గౌస్ తరచూ నందును డబ్బులు అడగడం, రోడ్లపై నిలదీస్తుండటంతో నందు కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో బర్కత్‌పల్లి రోడ్డు పక్కన కూర్చున్న గౌస్‌తో నందు గొడవకు దిగి కత్తితో దాడి చేశాడు. గౌస్ తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నగరానికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.


