కందుకూరులోని 430/ఎ, 431/ఎ2/ఎ సర్వే నంబర్లలో వారసత్వంగా వచ్చిన 12 ఎకరాల భూమి ఉంది. ముగ్గురు కొడుకుల పేరున తలో నాలుగు ఎకరాల చొప్పున రిజిస్ట్రేషన్ చేయాలని 2025 మే 29న చలానా కట్టిన. రిజిస్ట్రేషన్ సమయంలో మా తమ్ముడు, అక్క వచ్చి అడ్డుకున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. చలానా రూపంలో చెల్లించిన రూ.6.18 లక్షలు తిరిగి చెల్లించాల్సిందిగా అభ్యర్థించా. ఇప్పటికే ఆరుసార్లు ప్రజావాణికి వచ్చి విన్నవించినా లాభం లేదు. ఎప్పుడిస్తారో కూడా చెప్పడం లేదు.
– ఎస్.మల్లేష్, ఎదులాబాద్
ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు రెవెన్యూ సర్వే నంబర్ 488,489,490,495లలో నా భార్య స్వరూప పేరున ఐదెకరాల పట్టా భూమి ఉంది. 38ఈ, పీటీ సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. నా భార్య పేరున సక్షేషన్ అయింది. కొంతమంది నకిలీ పత్రాలు సృష్టించి, భూమిని కబ్జా చేశారు. రోడ్లు వేసి, వెంచర్ చేసి గుట్టుగా విక్రయించారు. రెవెన్యూ కోర్టును ఆశ్రయించి మొత్తం భూమిని నిషేధిత జాబితాలో పెట్టించాను. కబ్జాదారుల ఒత్తిడికి తలొగ్గిన అధికారులు హియరింగ్ నిర్వహించకుండా దాటవేస్తున్నారు. ప్రజావాణిలో పలుమార్లు ఫిర్యాదు చేశాను. ఇప్పటికీ హియరింగ్ నిర్వహించ లేదు.
– కె.కృష్ణారెడ్డి, కప్పాడు


