హుడాకాంప్లెక్స్: దేశంలో, రాష్ట్రంలో అవినీతి పాలనకు చరమగీతం పాడాలని ఆలిండియా వర్కర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాయబండి పాండురంగం అన్నారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర మొదటి మహాసభ సందర్భంగా సోమవారం కొత్తపేట చౌరస్తాలో పార్టీ నాయకులతో కలిసి జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని, కార్మిక, కర్షక, రాజ్యాధికారం కోసం పనిచేయాలని కోరారు. దేశం పూర్తిగా అవినీతిమయం, లీకేజీలమయమైందని విమర్శించారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆలిండియా వర్కర్స్ పార్టీ తెలంగాణలో బలమైన శక్తిగా ఎదిగి, అవినీతి రహిత పాలన కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. నవంబర్‌లో రాష్ట్ర కమిటీ సమావేశాలు యాదాద్రిలో ఏర్పాటు చేసి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకురాలు శాంతి తదితరులు పాల్గొన్నారు.


