షాద్‌నగర్‌రూరల్: లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణంపై ప్రజా సంఘాల నాయకులు విమర్శించడం సరికాదని గిరిజన ఆదివాసీ రాష్ట్ర కో ఆర్డినేటర్ రఘునాయక్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పారిశ్రామికవేత్తలకోసం నిర్మిస్తున్నారని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. రిజర్వాయర్ నిర్మాణంకోసం తట్టెడు మట్టిని తీయకుండా నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదని మండిపడ్డారు. డిండి నుంచి నీటిని నల్లగొండకు తరలించుకుపోతే స్థానిక ఎమ్మెల్యేకు ఏం సంబంధమని, అది జాతీయ సమస్య అని తెలియకపోవడం విచిత్రంగా ఉందన్నారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు సంబంధించి 10టీఎంసీల నీటి సామర్థ్యాన్ని 2.8 టీఎంసీలకు కుదించిన పాపం బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. భూ సేకరణ అనంతరం నీటిని ఎక్కడి నుంచి తరలించాలనే విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉందన్నారు. ఈ సమావేశంలో నాయకులు మహ్మద్ అలీఖాన్ బాబర్, ఎం.డి.ఇబ్రహీం, సయ్యద్‌ఖదీర్, గంగాధర్ తిలక్, షర్పొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.


