సాక్షి, రంగారెడ్డిజిల్లా: అధికార, ప్రతిపక్ష పార్టీల పోటాపోటీ ఆందోళనలతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఉమ్మడి జిల్లా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల పోటాపోటీ ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనాలు, అరెస్టులతో ఒక్కసారిగా హీటెక్కింది. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను ఎండగడుతూ ప్రతిపక్ష బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీకి వెళ్లారు. పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. మహిళా ఎమ్మెల్యేలను బలవంతంగా అరెస్ట్ చేయడంపై బీఆర్‌ఎస్ శ్రేణులు, స్పీకర్‌పై అనుచిత వాఖ్యలు చేయడంపై అధికార కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, చేవెళ్ల, షాద్‌నగర్, కల్వకుర్తి, వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల్లో పోటాపోటీ నిరసన కార్యక్రమాలు, దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించారు. మరోవైపు పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్‌తో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన అసెంబ్లీ ముట్టడికి పార్టీశ్రేణులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా పలుచోట్ల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఉమ్మడి జిల్లా ఒక్కసారిగా వేడెక్కింది.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పరస్పర ఆందోళనలు
ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనాలు
అసెంబ్లీ ముట్టడికి తరలివెళ్లిన బీజేపీ నాయకులు
ఉమ్మడి జిల్లాలో ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయాలు


