కడ్తాల్: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ (సీజీఆర్) పనిచేస్తుందని సంస్థ వ్యవస్థాపకుడు కోర్పోలు లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఆధ్వర్యంలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 19 వరకు నిర్వహిస్తున్న కంబైన్డ్ ఫౌండేషన్ కోర్సు (సీఎఫ్‌సీ) గ్రూప్–2 బ్యాచ్ ఏలో భాగంగా 223 మంది ట్రైనీ అధికారులు సోమవారం అన్మాస్‌పల్లి సమీపంలోని ఎర్త్ సెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రకృతికి దగ్గరగా ఉంటూ ప్రజలకు సేవ చేయాలని ట్రైనీ అధికారులకు సూచించారు. పర్యావరణ శాస్త్రవేత్త నక్క సాయిభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఫైళ్లు కాదు ప్రకృతిని అర్థం చేసుకోవాలన్నారు. అభివృద్ధి పేరుతో అడువులను నాశనం చేయకుండా కాపాడాలన్నారు. పర్యావరణవేత్త ఉమామహేశ్వర్‌రెడ్డి పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిద్య సంరక్షణ, సుస్థిర జీవన విధానాలు, అటవీ సంరక్షణ కార్యక్రమాలను తెలియజేశారు. సంస్థ ప్రతినిధులు రజనీకాంత్, పాలడుగు నగేశ్ బయో ఎంజైమ్, బయోచార్, విత్తన బంతుల తయారీ, ఔషధ మొక్కల వినియోగంపై ట్రైనీ అధికారులకు వివరించారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌ఓ లక్ష్మణ్, ఫారెస్ట్ అధికారులు ఉన్నారు.


