మొయినాబాద్: పవర్‌గ్రిడ్ అంతర్ ప్రాంతీయ కబడ్డీ టోర్నమెంట్‌లో సదరన్ రీజియన్–1 (ఎస్‌ఆర్–1) జట్టు విజేతగా నిలిచింది. మొయినాబాద్‌లోని ఫైర్‌ఫాక్స్ స్పోర్ట్స్ అండ్ రిసార్ట్స్‌లో భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన అంతర్ ప్రాంతీయ కబడ్డీ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. దేశవ్యాప్తంగా ఉన్న పవర్‌గ్రిడ్ ప్రాంతీయ కార్యాలయాల నుంచి క్రీడాకారులు పాల్గొని అత్యత్తమ క్రీడా నైపుణ్యం, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు. టోర్నమెంట్‌లో మొత్తం 12 జట్లు పాల్గొని హోరాహోరిగా తలపడ్డాయి. ఎస్‌ఆర్–1, ఎస్‌ఆర్–2 జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఎస్‌ఆర్–1 జట్టు ఎస్‌దర్–2 జట్టుపై 38–34 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. విజేతగా నిలిచిన ఎస్‌ఆర్–1 జట్టుకు ట్రోఫీని అందజేశారు. ఎస్‌ఆర్–2 జట్టు రన్నరప్‌గా నిలువగా తృతీయ స్థానంలో కార్పొరేట్ సెంటర్ (సీసీ) జట్టు, నాలుగో స్థానంలో నార్తర్న్ రీజియన్–3(ఎన్‌ఆర్–3) జట్లు నిలిచాయి. ఉత్తమ రైడర్‌గా అమన్ ఠాకూర్ (కార్పొరేట్ సెంటర్), ఉత్తమ క్యాచర్‌గా క్లారెక్స్ (ఎస్‌ఆర్2), ఉత్తమ ఆల్‌రౌండర్‌గా లవన్‌కుమార్ (ఎస్‌ఆర్–1) నిలిచి బహుమతులు అందుకున్నారు. కార్యక్రమంలో ఎస్‌ఆర్–1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దోమన్ యాదవ్, చీఫ్ జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ శ్రవణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


