కడాకు నిధుల వరద | - | Sakshi
Sakshi News home page

కడాకు నిధుల వరద

Sep 7 2026 7:39 AM | Updated on Sep 7 2026 7:39 AM

సొంత గడ్డకు ప్రాధాన్యం.. పక్క నియోజకవర్గాలకు మొండిచేయి

వికారాబాద్‌: వడ్డించే వాడు మనవాడైతే వెనుక బంతిలో కూర్చున్న పర్వాలేదన్నట్టుగా కొడంగల్‌ నియోజకవర్గ పరిస్థితి ఉందని జిల్లా వాసులు చర్చించుకుంటున్నారు. జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌ మినహా మిగిలిన నియోజకవర్గలపై వివక్ష చూపుతున్నారంటూ ఆయా నియోజకవర్గ పరిధి ప్రజలు ఆరోపిస్తున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి మొదలు జిల్లాలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

‘కడా’కే పరిమితమైన సమీక్షలు

తాజాగా శుక్ర, శనివారాల్లో సీఎం జిల్లా పర్యటనలోనూ ఇదే పునరావృతమైంది. రెండు రోజుల ఆయన సుధీర్ఘ పర్యటన పూర్తిగా కడా(కొడంగల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ)కే కట్టుబడ్డారు. జిల్లా అధికారుల సమీక్షా, బీఎల్‌ఏ, కార్యకర్తల సమావేశంలోనూ ఆయన మాటలు కడా పరిధి దాటలేదు. పలుమార్లు జిల్లాలో పర్యటించిన ఆయన మున్సిపల్‌ ఎన్నికల ముందు పరిగి మండలంలో ఏర్పాటు చేసిన బహిరంగభకు హాజరవడం మినహా మిగిలిన మూడు నియోజకవర్గాలు, కలెక్టరేట్‌లో ఇప్పటి వరకు అడుగుపెట్టలేదు. జిల్లాకు వచ్చిన ప్రతీసారి సమీక్ష నిర్వహిస్తున్న సీఎం సొంత నియోజకవర్గానికే అధికారులను రప్పించి భారీ షెడ్లు వేయించి అక్కడే రివ్యూ నిర్వహిస్తున్నారు. ఇందుకు రూ.కోట్లు వెచ్చిస్తున్నారు తప్ప కలెక్టరేట్‌లో ఉన్న కాన్ఫరెన్స్‌ హాల్‌ను వినియోగించుకోవడంలేదు. నియోజకవర్గ స్థాయి సమీక్షకు జిల్లా అధికారులు, జిల్లాకు చెందిన ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎందుకనేది పాలుపోవడం లేదు.

అభివృద్ధి పనులు శంకుస్థాపనలకే పరిమితం

ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతీసారి వికారాబాద్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న శాసన సభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ వెళ్లి సీఎంను కలుస్తున్నారు. పరిగి, తాండూరు ఎమ్మెల్యేలు సైతం ఆయన పర్యటనలో భాగస్వాములు అవుతున్నారు. పనులు పరిశీలించే సమయంలో పక్కన ఉంచుకుంటున్నారు. కడాలో కొనసాగుతున్న పనులపై అధికారులతో సమీక్షించే సమయంలోనూ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సీఎంకు చెరో పక్క కూర్చుకుంటున్నారు. గంటల తరబడి కొనసాగుతున్న సమీక్షల్లో ఇతర నియోజకవర్గాల గురించి.. ఆ నియోజకవర్గాలకు మంజూరు చేసిన పనుల గురించి, వాటి పురోగతి గురించి ఒక్క మాట మాట్లాడడం లేదు. కనీసం పనుల ప్రోగ్రెస్‌ ఎలా ఉందని సంబంధిత జిల్లా అధికారులను అడగటంలేదు. గతంలో సీఎం నిర్వహించిన జిల్లా పర్యటనలన్నింటిలో ఇదే కొనసాగగా తాజా పర్యటనలోనూ ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించారు. సీఎం సొంత నియోజకవర్గంలో పనుల పురోగతిని పర్యవేక్షించటంతో పాటు జూనియర్‌ కళాశాల భవన సముదాయం, సీహెచ్‌సీ భవనం, ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌ భవనం ప్రారంభించారు. ఈ పనులు మంజూరైన సమయంలోనే జిల్లాలో ఇతర నియోజకవర్గాల్లో మంజూరైన పనులు ఇంకా శంకుస్థాపనలకే పరిమితమవటం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

సమీక్షల సమయంలో పక్కనే ఉంటున్న స్పీకర్‌, ఎమ్మెల్యేలు

కొడంగల్‌ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.400 కోట్లు

యాభైశాతం పనులు పూర్తి

మిగిలిన నియోజకవర్గాలకు రూ.30 కోట్లు మంజూరు

శిలాఫలకాలకే పరిమితమైన పనులు

విమర్శలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు

సీఎం సమీక్షలు సొంత నియోజకవర్గానికే పరిమితం

జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న వ్యక్తిని సీఎం పదవి వరించి వెయ్యిరోజులైంది. అప్పుడప్పుడు అభివృద్ధి పేరిట హడావుడి చేస్తున్న మంత్రుల పర్యటనలు ఆర్‌అండ్‌బీ రోడ్లు దాటి ఇంకో శాఖకు విస్తరించడం లేదు. కొడంగల్‌ మినహా మిగిలిన మూడు మున్సిపాలిటీలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. చిన్న మున్సిపాలిటీ కొడంగల్‌లో రూ.400 కోట్లతో చేపడుతున్న సీసీ రోడ్లు, యూజీడీ పనులు ఇప్పటికే యాభై శాతం పూర్తయ్యాయి. మున్సిపల్‌ శాఖ బాధ్యతలు సైతం చూస్తున్న సీఎం సొంత జిల్లాలో మిగిలిన మూడు మున్సిపాలిటీలు నిధులలేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. గతేడాది నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యేలు చేసిన హడావుడి శిలాఫలకాల వద్దే ఆగిపోయాయి. జిల్లాలో పనులకు టెండర్లు పిలిచి ఏడాది కావస్తున్నా..? ఒక్క పరిగి–వికారాబాద్‌, పరిగి–షాద్‌నగర్‌ రోడ్లు మినహా మిగతా పనులు ప్రారంభానికి నోచుకోవడంలేదు. ప్రారంభమైన పనులు సైతం మధ్యలోనే నిలిచిపోయాయి. జిల్లా పరిధిలోని నాలుగు మున్సిపాలిటీలు నిధులలేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. రహదారులు పాడై ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మంజూరైన పనులు ప్రారంభించడంలో జాప్యం కారణంగా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలకు ప్రజా విమర్శలు తప్పడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement