ఇబ్రహీంపట్నం రూరల్: కోడి పందేలపై శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్, ఆదిభట్ల పోలీసులు సంయుక్తంగా మెరుపుదాడి చేశారు. పందెం రాయుళ్లను అరెస్టు చేసి నగదుతో పాటు, విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ రమేష్ కథనం ప్రకారం.. మన్నెగూడ ఆర్‌టీఓ కార్యాలయం వెనుక భాగంలో గుట్టు చప్పుడు కాకుండా కోడి పందేలు, జూదం నిర్వహిస్తున్నారని సమాచారం అందడంతో శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్, ఆదిభట్ల పోలీసులు ఉమ్మడిగా దాడి చేశారు. పాత పౌల్ట్రీ ఫామ్ వేదికగా ప్రత్యేకంగా పందెం కోళ్లను పెంచుతూ పందేలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు వివిధ ప్రాంతాల నుండి పందెం రాయుళ్లను ఆహ్వానించి, వారికి భోజన వసతి కల్పించి పందేలు, పేకాట నిర్వహణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. విశ్వసనీయ సమాచారంతో దాడి చేసి 22 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడు, స్థల యజమాని పరారీలో ఉన్నారు. వీరి నుంచి రూ.3,60,510 నగదు, 31 పందెం కోళ్లు, 146 కోడి కత్తులు, 20 స్మార్ట్ ఫోన్లు, స్కోర్ నోట్‌బుక్, మూడు కార్లు, మరో మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఆదిభట్ల పోలీసులకు అప్పగించారు. ఈ దాడిలో శంషాబాద్ జోన్ ఇన్‌స్పెక్టర్ డి.కృష్ణమోహన్, ఎస్‌ఐలు మన్సూర్ అలీ, ఎన్.నర్సింగరావు పాల్గొన్నారు. వారిని అడిషనల్ డిప్యూటీ కమిషనర్ కేఎస్ రావు అభినందించారు.
22 మంది పందెం రాయుళ్ల అరెస్టు నగదు, పందెం కోళ్లు, వాహనాలు స్వాధీనం


