సాధారణ ఫ్లూ, స్వైన్‌ఫ్లూ లక్షణాలు చూడటానికి ఒకేలా కనిపిస్తాయి. అంత మాత్రాన జ్వరం, దగ్గు, ముక్కు కారడం తదితర లక్షణాలు కనిపించగానే స్వైన్ ఫ్లూగా భావించాల్సిన అవసరం లేదు. రోగ నిరోధక శక్తి తక్కువ ఉండే మధుమేహులు, గర్భిణులు, పిల్లలు, వృద్ధులు సహా కిడ్నీ, కాలేయ మార్పిడి చికిత్సలు చేయించుకున్న బాధితులు ఫ్లూ భారిన పడే అవకాశాలు ఎక్కువ. సాధారణ ఫ్లూ, స్వైన్‌ఫ్లూలను వైద్యులే గుర్తించాలి. అయితే స్వైన్ ఫ్లూలో దగ్గు, జలుబు, ముక్కు కారడం, దిబ్బడగా ఉండటం, 101, 102 డిగ్రీల జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసం, నిస్సత్తువ, తలనొప్పి, కొందరిలో వాంతులు, విరోచనాలు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్నవారు తుమ్మినా, దగ్గినా చేతి రుమాలు అడ్డం పెట్టుకోవాలి. బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు చేతులు, కాళ్లు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. పిల్లలకు ఈ అలవాటు నేర్పించాలి. మూడు రోజులు కంటే ఎక్కువ వేధిస్తే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారి విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడుదు.
– డాక్టర్ నాగేందర్, సూపరింటెండెంట్, మహేశ్వరం మెడికల్ కాలేజీ


