చర్యలు తీసుకుంటున్నాం
పోటీలతో క్రీడాస్ఫూర్తి.. నాదర్‌గుల్‌లో విద్యాభారతి విజ్ఞాన కేంద్రం పాఠశాల ప్రాంగణంలో శనివారం ఖేల్ ఖూద్–26 పోటీలు నిర్వహించారు.
మొయినాబాద్: మున్సిపాలిటీలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై మొయినాబాద్ మీదుగా నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ప్రధాన రహదారికి ఇరుపక్కల ఉన్న షాపులు, హోటళ్ల ముందు పార్కింగ్ సరిగా లేక వాహనదారులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు షాపుల ఎదుట బండి కొట్లు ఏర్పాటు చేయడంతో వాహనాలను రోడ్లుపైనే నిలుపుతున్నారు. దీంతో ప్రతి రోజు మొయినాబాద్ ప్రధాన చౌరస్తాతోపాటు హిమాయత్‌నగర్, అజీజ్‌నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. హిమాయత్‌నగర్ చౌరస్తా నుంచి అజీజ్‌నగర్ చౌరస్తా వరకు హోటళ్లు, గ్రానైట్, టైల్స్ షాపులు అధికంగా ఉన్నాయి. ప్రధానంగా హోటళ్ల వద్ద వాహనాలకు సరిపడా పార్కింగ్ స్థలం లేక రోడ్లపైనే వాహనాలు నిలుపుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. దీన్ని పరిష్కరించాల్సిన అధికార యంత్రాంగం, పోలీసులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో సమస్య మరింత జఠిలమవుతోంది.
రాంగ్ రూట్‌లో స్కూల్, కాలేజీ బస్సులు
మొయినాబాద్‌తోపాటు చేవెళ్ల, వికారాబాద్ ప్రాంతాల్లో ఫాంహౌస్‌లు, రిసార్ట్స్‌లు అధికంగా ఉన్నాయి. వీకెండ్స్‌లో చాలా మంది ఫాంహౌస్‌లు, రిసార్ట్స్‌లకు, అనంతగిరికి వెళ్తుండడంతో ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతోంది. సాధారణ రోజుల్లో సైతం ఉదయం, సాయంత్రం స్కూల్, కళాశాలల బస్సులతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. స్కూల్, కళాశాలల బస్సులు రాంగ్‌రూట్లో వెళ్తూ ట్రాఫిక్ అంతరాయానికి ఓ కారణమవుతున్నాయి.
అధికారులు, పోలీసుల నిర్లక్ష్యం
వ్యాపార సముదాయాలు, షాపులు, హోటళ్లకు మున్సిపల్ కార్యాలయం నుంచి నిర్వాహకులు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. మున్సిపల్ అధికారులు వీటిపై దృష్టి పెట్టకుండా మామూళ్లకు ఆశపడి ఇష్టానుసారంగా వదిలేస్తున్నారనే అపవాదు ఉంది. దీంతో రహదారికి ఇరుపక్కల ఉన్న షాపులు, వ్యాపార సముదాయాల ఎదుట ఖాళీ స్థలం ఎంత ఉంది. పార్కింగ్ స్థలం ఉందా అనే విషయాలను మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదు. దీంతో షాపుల ఎదుట స్థలాన్ని కబ్జాచేసి వాటిలో బండికొట్లు ఏర్పాటు చేయిస్తున్నారు. వారి వద్ద రోజు లెక్క అద్దె వసూలు చేస్తూ లక్షలు దండుకుంటున్నారు. షాపుల ఎదుట అక్రమంగా రేకుల షెడ్లు ఏర్పాటు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదు.
వీఐపీ రూట్.. అయినా మారని పరిస్థితి
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో హైదరాబాద్–బీజాపూర్ రహదారిని వీఐపీ మూవ్‌మెంట్ రూట్‌గా ప్రకటించారు. సీఎం కొడంగల్ వెళ్లాలంటే ఇదే రూట్‌లో వెళ్లాల్సి ఉంటుంది. శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తన నియోజకవర్గం వికారాబాద్‌కు వెళ్లేందుకు ఇదే మార్గం. వారంలో రెండు మూడు సార్లు ఆయన వికారాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటారు. అందుకే పోలీసులు వీఐపీ మూమెంట్ రూట్‌గా ప్రకటించారు. కానీ అందుకు తగినట్లు చర్యలు తీసుకోవడం లేదు.
ఫొటోలు తీసి ఛలాన్లు
మొయినాబాద్ ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఫోటోలు తీయడం, చలాన్లు వసూలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. నిత్యం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతున్నా క్లియర్ చేయకుండా రోడ్డుపక్కన నిలిపిన వాహనాల ఫొటోలు తీసి చలాన్లు వేస్తున్నారు. షాపుల ఎదుట పార్కింగ్ స్థలం లేక రోడ్డుపక్కన వాహనాలు నిలిపితే ఫొటోలు తీసి ఫైన్‌లు వేస్తున్నారని స్థానికులు, వాహనదారులు ఆరోపిస్తున్నారు.
వీకెండ్స్‌లో విపరీతం
హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై నిత్యం ట్రాఫిక్ అంతరాయం
పార్కింగ్ సదుపాయం లేక రోడ్లపైనే పార్కింగ్
ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు
మొయినాబాద్‌లో షాపుల ఎదుట సామగ్రి పెట్టినా, బండికొట్లు పెట్టినా వాటిని తొలగించేందుకు నోటీసులు ఇవ్వాలని మున్సిపల్ అధికారులకు తెలిపాం. అలా పెట్టినవారికి చలాన్లు వేస్తున్నాం. వాహనాల రాకపోకలు పెరగడంతోనే ట్రాఫిక్ సమస్య వస్తోంది. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం.
– సతీశ్, ట్రాఫిక్ సీఐ, చేవెళ్ల
నాలుగు రోజుల క్రితం మొయినాబాద్ మున్సిపాలిటీలోని ఓ కన్వెన్షన్‌లో జరిగిన వివాహ వేడుకకు హాజరైన మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి అజీజ్‌నగర్ చౌరస్తా వద్ద అంతరాయం కారణంగా అరగంట పాటు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు.
మొయినాబాద్ నుంచి అప్పా జంక్షన్ వరకు సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరం. సాధారణ రోజులో కేవలం పది నిమిషాల్లో వెళ్లొచ్చు. కానీ శని, ఆదివారం వచ్చిందంటే సుమారు అరగంటకు పైగా సమయం పడుతుంది. ఇదీ మొయినాబాద్‌లో ట్రాఫిక్ పరిస్థితి.


