కార్యకర్తలే నా బలం | - | Sakshi
Sakshi News home page

కార్యకర్తలే నా బలం

Sep 6 2026 8:25 AM | Updated on Sep 6 2026 8:25 AM

కాంగ్రెస్‌ ఓట్లు తొలగించేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుట్ర ప్రతి పేదవాడికీ ఓటు హక్కు ఉండాలి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి

కొడంగల్‌/బొంరాస్‌పేట/వికారాబాద్‌: కొడంగల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీని తమ భుజాల మీద మోస్తున్న కార్యకర్తలే తనకు బలమని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వారి సహకారం.. అండ దండలతోనే తనకు ఈ పదవి, హోదా దక్కిందని పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని ఆయన నివాసంలో నియోజకవర్గ పరిధిలోని బీఎల్‌ఏలు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లు తొలగించడానికి బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. తడి బట్టతో గొంతు కోసినట్లు ఓట్లను తొలగించి పలు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. నియోజకవర్గంలో ఒక్క ఓటు కూడా పోకుండా చూడాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలు తీసుకోవాలన్నారు. ప్రతి పేద వాడికీ ఓటు హక్కు ఉండాలన్నారు. ప్రజా పాలనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగే బాధ్యత తనపై ఉందన్నారు. కొడంగల్‌లో మాత్రమే ప్రతి కార్యకర్త ఒక రేవంత్‌రెడ్డిగా భావించి ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నారు. దేశ స్థాయిలో కొడంగల్‌కు గుర్తింపు వచ్చిందంటే అది మీ వల్లే సాధ్యమైందని కార్యకర్తలకు సూచించారు. కొడంగల్‌లో 81 వేల మంది ఓటర్లకు నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు. పేర్లలో తప్పులు, అడ్రసులో మార్పులు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని నోటీసులు ఇచ్చారని అన్నారు. వాటిని సరి చేయించి ఓటును కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నా రు. ఇది పేదల సమస్య. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఓట్లు తొలగించడానికి కుట్రలు జరుగుతున్నాయని, ఈ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఎల్‌ఏలు నిర్లక్ష్యం వహించకుండా ప్రతి పేద వాడికి ఓటు హక్కు కల్పించాలన్నారు. కొడంగల్‌లో 35వేల ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు చెప్పారు. ఓట్లను కాపాడుకుంటేనే వచ్చే ఎన్నికల్లో గెలుస్తామన్నారు. లేకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఇంటింటికి వెళ్లి సర్‌లో పేర్లు నమోదు చేయించాలన్నారు. ఓటు లేకపోతే ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి ఫలాలు, సంక్షేమ పథకాలు పేదలకు అందకుండా పోతాయని హెచ్చరించారు. ఎన్యూమరేషన్‌ ప్రక్రియను వందశాతం పూర్తి చేసి కొడంగల్‌ను ముందు వరుసలో నిలబెట్టాలన్నారు. కొడంగల్‌ను అభివృద్ధి చేసుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందన్నారు. మళ్లీ కొడంగల్‌పై కక్ష కట్టి సర్‌లో ఓట్ల తొలగించడానికి కుట్ర చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ఒక్క ఓటు కూడా పోకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మ, తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ కల్వ సుజాత, కొడంగల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ నందారం ప్రశాంత్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ అంబయ్య గౌడ్‌, పీసీసీ సభ్యుడు మహ్మద్‌ యూసూఫ్‌, నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

వారి సహకారంతోనే పదవి, హోదా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement