షాద్‌నగర్: పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా లక్ష్మీదేవిపల్లిలో నిర్మించే రిజర్వాయర్‌కు సంబంధించిన డీపీఆర్‌ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ విద్యావంతుల వేదిక(టీవీవీ) రాష్ట్ర కోశాధికారి టీజీ శ్రీనివాస్, పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి తిరుమలయ్య డిమాండ్ చేశారు. శనివారం వారు పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో విలేకరులతో మాట్లాడుతూ.. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ఉద్యమ సమంలో ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజాస్వామిక వాదులు పెద్ద ఎత్తున పోరాటాలు చేశారన్నారు. గతంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్‌ను మార్చి జూరాల నుంచి కాకుండా శ్రీశైలం నుంచి నీటిని ఎత్తిపోసే విధంగా డిజైన్‌ను రూపొందించారన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో చివరిదైన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను నిర్మించేందుకు సిద్ధమైన కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టడం, భూసేకరణకు నోటీఫికేషన్ జారీ చేయడం హర్షనీయమని అన్నారు. రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టును ప్రభుత్వం ప్రజల ముందు ఉంచాలన్నారు. ఈ రిజర్వాయర్‌తో ఈ ప్రాంత రైతులకు, ప్రజలకు ఎంత ఉపయోగకరంగా ఉంటుందో తెలియజెప్పాల్సిన భాద్యత ప్రభుత్వం ఉందని అన్నారు. ఈ సమావేశంలో కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ పినబాక ప్రభాకర్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు అర్జునప్ప, పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ రవీందర్ పాల్గొన్నారు.
టీవీవీ రాష్ట్ర కోశాధికారి టీజీ శ్రీనివాస్


