యూఎల్సీల క్రమబద్ధీకరణ? | - | Sakshi
Sakshi News home page

యూఎల్సీల క్రమబద్ధీకరణ?

Sep 4 2026 7:35 AM | Updated on Sep 4 2026 7:35 AM

మిగులు స్థలాల్లో నివాసాలకు శాశ్వత పట్టాలు

సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటి వరకు ప్రభుత్వ, అసైన్డ్‌ భూముల్లో అక్రమంగా నిర్మించుకున్న నివాసాల స్థలాలను క్రమబద్ధీకరించి శాశ్వత హక్కులు కల్పించిన సర్కారు.. తాజాగా అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ (యూఎల్‌సీ) భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నవారికి కూడా అదే విధంగా క్రమబద్ధీకరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రెవెన్యూ యంత్రాంగం ముందస్తు కసరత్తు చేస్తోంది. మహానగర పరిధిలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాల్లోని యూఎల్సీ భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకొని లక్షలాది కుటుంబాలు దశాబ్దాలుగా నివసిస్తున్నాయి. చాలా చోట్ల సీఎం డిక్లరేషన్‌న సరిగా పూర్తికాకపోవడం, సెక్షన్‌ 22ఎ జాబితాలో చేరడంతో క్రయవిక్రయాలు, నిర్మాణ అనుమతులు, బ్యాంకు రుణాలు నిలిచిపోయాయి. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం తాజాగా సమగ్ర రెగ్యులరైజేషన్‌ విధానం రూపొందించాలని నిర్ణయించింది. ఇది కేవలం హక్కుల కల్పనే కాకుండా ప్రభుత్వ ఖజానాకు గణనీయమైన ఆదాయం చేకూర్చే అవకాశం కూడా లేకపోలేదు. రెవెన్యూ శాఖ అధికారులు ఇప్పటికే వివరాలు సేకరిస్తూ విధాన రూపకల్ప నకు సిద్ధమవుతున్నారు.

రెండు వేల ఎకరాలపైనే..

మహా హైదరాబాద్‌ పరిధిలో అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ భూములు సుమారు రెండు వేల ఎకరాలకు పైగా ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో సగానికి పైగా మేడ్చల్‌–మల్కాజిగిరిలోనే భూమి ఉంది. రంగారెడ్డి జిల్లాలోని భూములు ఎక్కువగా పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. హైదరాబాద్‌ నగర పరిధిలోని భూములు తక్కువగా ఉన్నా.. విలువ ఎక్కువగా ఉండటంతో వాటికి డిమాండ్‌ ఎక్కువైంది. జిల్లాల వారీగా వేర్వేరు స్థాయిలో సమస్యలు ఉండటంతో విధానం రూపకల్పనలో ప్రాధాన్యతలు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. యూఎల్సీ మిగులు భూముల విస్తీర్ణం రెవెన్యూ జిల్లాల వారీగా పరిశీలిస్తే.. మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో అత్యధికంగా 50,69,215 చదరపు మీటర్లు, రంగారెడ్డి జిల్లాలో 28,46,860 చదరపు మీటర్లు, హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 3,83,586 చదరపు మీటర్ల స్థలాల ఉన్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి.

ప్రభుత్వానికి ఆదాయం

యూఎల్సీ స్థలాల క్రమబద్ధీకరణ కోసం వేలాది దరఖాస్తులు అందినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని వేల దరఖాస్తులకు కన్వియేన్స్‌డీడ్‌లు జారీ చేయడంతో ఖజానాకు భారీగానే జమ అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ జిల్లాలో మొత్తం 5,263 దరఖాస్తులు అందగా అందులో 4,927 పరిష్కారం కావడంతో ప్రభుత్వానికి రూ.61.61 కోట్లు రెవెన్యూ లభించింది. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలో మొత్తం 11,388 అర్జీలు రాగా, అందులో 5,809 పరిష్కారం కావడంతో 408.32 కోట్ల రాబడి వచ్చింది.

సమగ్ర విధానం

సెక్షన్‌ 22ఎ జాబితాలో చేరిన భూముల కారణంగా ఏర్పడిన సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం సర్కారు కసరత్తు చేస్తోంది. గతంలో జీవో 58, 59 ద్వారా మీసేవ ద్వారా కొన్ని స్థాయిల్లో పట్టాలు ఇచ్చినా సంపూర్ణ పరిష్కారం లభించలేదు. ప్రస్తుతం అమలులోకి రాబోతున్న ప్రత్యేక విధానంలో క్షేత్రస్థాయిలో డీటెయిల్డ్‌ సర్వే చేయాలని భావిస్తున్నారు.

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో లక్షలాది ఇళ్లు

పెండింగ్‌ దరఖాస్తులపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి

అసైన్డ్‌ భూముల తర్వాత మరో మెగా రెగ్యులరైజేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement