తుర్కయంజాల్: షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ కిరాణ దుకాణం దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిభట్ల సర్కిల్ పరిధి కమ్మగూడలోని లక్ష్మీనగర్ కాలనీలో కిరాణ దుకాణం నిర్వాహకులు మంగళవారం మధ్యాహ్నం షాపు మూసి భోజనానికి వెళ్లారు. కొద్ది సేపటికే దుకాణం నుంచి పొగలు వస్తుండడం గమనించిన స్థానికులు విషయాన్ని నిర్వాహకులకు తెలియజేశారు. వెంటనే హయత్‌నగర్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందిచడంతో వారు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. సుమారు రూ.లక్షన్నరకు పైగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడం, అందులో ఉన్న గ్యాస్ సిలిండర్‌లకు మంటలు అంటుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
3 తులాల బంగారం, 30 తులాల వెండి అపహరణ
శంకర్‌పల్లి: తాళం వేసి ఊరికి వెళ్లిన ఇంట్లో దొంగతనం జరిగిన సంఘటన శంకర్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని అయ్పప్పరెడ్డిగూడలో సరస్వతి అనే మహిళ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. గతనెల 30న ఇంటికి తాళం వేసి వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండలం దుర్గం చెరువుకి తన కూతురు, అల్లుడుతో కలిసి రాఖీ కట్టేందుకు వెళ్లింది. మంగళవారం ఉదయం ఇంటి తాళం పగులగొట్టి ఉందని స్థానికులు ఆమెకి సమాచారం ఇచ్చారు. వెంటనే ఇంటికి చేరుకొని దొంగతనం జరిగినట్లు గుర్తించింది. బీరువాలో ఉన్న 3 తులాల బంగారం, 30 తులాల వెండి, కొంత నగదు దొంగలు అపహరించుకొని వెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేశ్ తెలిపారు.
ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్‌సాయిపై కేసు
మణికొండ: ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్‌సాయిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయనపై డ్యాన్సర్ రమావత్ మాధురి రాథోడ్ ఫిర్యాదు చేయటంతో ఆగస్టు 22న కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈశ్వర్‌సాయి తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. వీరిద్దరూ ‘బాసింగ బలాలే’ జానపద నృత్యంలో నటించి పాపులర్ అయ్యారు. కేసు దర్యాప్తులో ఉంది.


