ఇబ్రహీంపట్నం రూరల్: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్ షిప్‌లను వెంటనే విడుదల చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు బీసీసంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారని తెలిపారు. హయత్‌నగర్, ఎల్‌బీనగర్‌లో కాలేజీలు బంద్ చేసి రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారని గుర్తు చేశారు. చదువులు పూర్తయినప్పటికీ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పదిహేను రోజుల్లో బకాయిలు ఇవ్వకుంటే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు, కలెక్టరేట్‌లు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఫీజు బకాయిలు ఇచ్చే వరకు సీఎం రేవంత్‌రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అక్రమంగా 22ఏ నిషేధిత జాబితాలో పెట్టిన భూములను తొలగించాలి, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ ఫ్రంట్ రాష్ట్ర చైర్మన్ మల్లేష్, నాయకులు రాజేందర్, అనంతయ్య, అరవింద్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.
రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య


