మణికొండ: రోజు మాదిరిగానే పార్కింగ్ స్థలంలో నిలిపిన వాహనాలు తెల్లవారు జామున చూసేసరికి ఆహుతవ్వటంతో స్థానికులు నిర్ఘాంతపోయారు. నార్సింగి ఎస్‌ఐ వెంకటేశం తెలిపిన మేరకు..హైదర్‌షాకోట్ సాయిహర్షనగర్ కాలనీలోని మహ్మద్ ఖాజకు చెందిన నివాసాన్ని అద్దెకు ఇస్తున్నాడు. అందులో అద్దెకు ఉంటున్న వారు తమ 8 ద్విచక్ర వాహనాలను పార్కింగ్‌లో నిలిపి పైన నివసిస్తున్నారు. ఆదివారం రాత్రి వాహనాలను పార్క్ చేశారు.సోమవారం తెల్లవారు జామున 3.30 గంటలకు పార్కింగ్‌లో నుంచి మంటలు రావటంతో గమనించి బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు. నాలుగు బైక్‌లు పూర్తిగా కాలిపోగా మరో నాలుగు పాక్షికంగా కాలిపోయాయి. మతి స్థిమితం లేని చైతన్య అనే యువకుడు ఇంట్లోకి వచ్చినట్టు సీసీ కెమరాల్లో నిక్షిప్తం అయ్యింది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, అతనికి మతిస్థిమితం సరిగా లేదని ఎస్సై తెలిపారు.


