అనంతగిరి: ఒంటరిగా నివసించే వితంతు, వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకొని బంగారు ఆభరణాల అపహరిస్తున్న అంతర్రాష్ట్ర మహిళా దొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం వికారాబాద్‌లో సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ బల్వంత్ రాయ్ వెల్లడించారు. తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలు జరుగుతుండటంతో ఎస్పీ స్నేహ మెహ్ర కేసును వికారాబాద్ సీసీఎస్‌కు అప్పగించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితురాలి కదలికలను గుర్తించారు. గతంలో ఆమె పాల్పడిన నేరాల వివరాలు, చేసిన విధానం తదితర అంశాలను విశ్లేషించారు. మహారాష్ట్ర సోలాపూర్‌కు చెందిన లక్ష్మి అసాడేగా గుర్తించారు. తాండూరులో సంచరిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అనేక విషయాలు వెలుగుచూశాయి. తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు కేసులు, 9.5 తులాల బంగారు ఆభరణాలు అపహరించినట్లు గుర్తించారు. కర్ణాటక రాష్ట్రంలోని గదగ్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులు, నవనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు ఉంది. ఈ మూడు కేసుల్లో మొత్తం 14.5 తులాల బంగారు ఆభరణాలు అపహరించింది. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో ఎంఐడీసీ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కేసులు, బర్షి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు, హైదరాబాద్ సిటీ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదైనట్లు గుర్తించారు. కేసు దర్యాపులో పురోగతి సాధించి, నిందితురాలిని అరెస్టు చేసిన వికారాబాద్ సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ బల్వంత్ రాయ్, తాండూరు టౌన్ ఎస్‌ఐ మమత, హెడ్ కానిస్టేబుళ్లు జయవర్ధన్, శివకుమార్, కానిస్టేబులు రామకృష్ణ, సాయప్ప, శివరాజ్, పాండు, రాజు, రవీందర్, గాయత్రిని జిల్లా అదనపు ఎస్పీ రాజేశ్ మీనా అభినందించారు.


