మలక్‌పేట: మలక్‌పేట సమతా రెసిడెన్సీలో నివసిస్తున్న రిటైర్డ్ ఎస్‌బీఐ సీనియర్ క్లర్క్ వెంకటపురం సాయినాథ్ దయాకర్ (71)ను సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసగించి రూ.64 లక్షలు కాజేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 9న ముంబైలో క్రెడిట్ కార్డుపై రూ.1,06,669 బకాయి ఉందంటూ ఐసీఐసీఐ బ్యాంక్ ప్రతినిధులమని ఫోన్ చేయడంతో ఈ మోసం మొదలైంది. ఆ కార్డు తనది కాదని బాధితుడు తెలపడంతో, కొద్దిసేపటికి వాట్సాప్ వీడియో కాల్ ద్వారా రవికుమార్ అనే వ్యక్తి ఐపీఎస్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. పహల్గామ్ దాడి కేసు, మనీలాండరింగ్, మాదకద్రవ్యాల కేసుల్లో ఆయన పేరు ఉందని బెదిరించారు. అమెరికాలో ఉన్న మనవడు, నాచారం నుంచి పంజాగుట్టకు వెళ్లే కుమార్తె వివరాలు చెప్పి కుటుంబంపై నిఘా ఉందని, సహకరించకపోతే మనవడిని డ్రగ్స్ కేసులో ఇరికిస్తామని భయపెట్టారు.సీబీఐ అధికారి ప్రదీప్‌సింగ్‌తో సహా పలువురు అధికారులుగా వీడియో కాల్స్‌లో మాట్లాడి, నకిలీ ఎఫ్‌ఐఆర్ కాపీలు, ఆర్‌బీఐ లేఖలు పంపారు. నిరంతరం మానసిక ఒత్తిడికి గురిచేస్తూ ఏప్రిల్ 10న రూ.2 లక్షలు, ఆ తర్వాత రూ.8 లక్షలు ఇలా విడతలవారీగా డబ్బులు బదిలీ చేయించుకున్నారు. నగదు సరిపోకపోవడంతో పెన్షన్, గోల్డ్ లోన్‌లు తీసుకోమని ఒత్తిడి చేశారు. అంతేకాకుండా నారపల్లిలోని కోట్లు విలువ చేసే ఆస్తిని ఆగస్టు 19న రూ.75 లక్షలకు అమ్మేలా తీవ్రంగా వేధించారు. నాలుగు నెలల పాటు ప్రభుత్వ అధికారులుగా నటిస్తూ బెదిరింపులకు పాల్పడగా, భయంతో ఆయన మొత్తం రూ.64 లక్షలు బదిలీ చేశారు. ఇటీవల మాల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలో ఇలాంటి డిజిటల్ అరెస్ట్ సైబర్ మోసంపై వచ్చిన వార్తా కథనం చూసి తాను మోసపోయానని బాధితుడు గ్రహించారు. వెంటనే కొడుకు, కూతురితో కలిసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తీవ్రమైన కేసులు పెడతామని నాలుగు నెలలపాటు వేధింపులు
ఆస్తులు అమ్మి రూ.64 లక్షలు చెల్లించిన బాధితుడు
సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు


