తలసరిలో అగ్రస్థానం | - | Sakshi
Sakshi News home page

తలసరిలో అగ్రస్థానం

Aug 17 2026 7:17 AM | Updated on Aug 17 2026 7:17 AM

పరిశ్రమల ఖిల్లాగా గుర్తింపు అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో టాప్‌ ఫ్యూచర్‌సిటీ, రేడియల్‌ రోడ్లతో మారనున్న రూపురేఖలు 80వ స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి శ్రీధర్‌బాబు ఆకట్టుకున్న శకటాలు, ఎగ్జిబిషన్‌ స్టాల్స్‌, చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘దేశంలో స్వాతంత్య్ర దినోత్సవంతో పాటు ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకొంటున్న ఏకై క జిల్లా రంగారెడ్డి మాత్రమే. జిల్లా ఏర్పడి నేటికి 49 ఏళ్లు పూర్తయింది. పరిశ్రమల ఖిల్లాగా గుర్తింపు పొంది దేశ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ముందు వరుసలో ఉంది. రూ.11.29 లక్ష ల తలసరి ఆదాయంతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.అభివృద్ధి,ప్రభుత్వ సంక్షేమ పథకాల్లోనూ దూసుకుపోతోంది’ అని జిల్లా ఇన్‌చార్జి మంత్రి దు ద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. 80వ స్వాతంత్య్ర దినో త్సవాన్ని పురస్కరించుకుని శనివారం కొంగరలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసు గౌరవవందనం స్వీకరించిన అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన మాటల్లోనే..

ఇతర జిల్లాలకు ఆదర్శం

పరిశ్రమల ఖిల్లాగా, ఉపాధి, పర్యాటక గమ్యస్థానంగా పేరొందిన జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ముందుండి ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌లకు దీటుగా ఫ్యూచర్‌సిటీ రూపుదిద్దుకోబోతోంది. ఇది పూర్తిగా నెట్‌జీరో సిటీగా అవతరించబోతోంది. రావిర్యాల నుంచి మీర్‌ఖాన్‌పేట మీదుగా ఆకుతోటపల్లి వరకు 41 కిలోమీటర్ల 300 ఫీట్ల రేడియల్‌ రోడ్డు సహా బుద్వేల్‌ నుంచి నాచారం వరకు 81 కిలోమీటర్ల దూరం నిర్మిస్తున్న మరో రేడియల్‌ రోడ్డుతో రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయి.

స్మార్ట్‌రేషన్‌కార్డులు

936 చౌకధరల దుకాణాల పరిధిలో ఉన్న 6,72, 909 కుటుంబాలకు ప్రతి నెలా 14,379 మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నాం. లబ్ధిదారులందరికీ క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత స్మార్ట్‌రేషన్‌ కార్డులను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశాం. మహాలక్ష్మి పథకంలో భాగంగా 215 కోట్ల జీరో టికెట్లు జారీ చేసి, రూ.1,569 కోట్లు మహిళా ప్రయాణికులకు చార్జీల రూపంలో ఆదా చేశాం. గృహజ్యోతి పథకంలో భాగంగా ప్రతి నెలా 200 యూనిట్ల లోపు విద్యుత్‌ వాడే 3,62,126 మంది లబ్ధిదారులకు జీరో బిల్లుల రూపంలో రూ.323.71 కోట్లు సబ్సిడీగా చెల్లించాం. రైతు భరోసా పథకం కింద 2.95 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.341 కోట్లు జమ చేశాం. రైతుబీమా కింద 721 మంది రైతుల నామినీల ఖాతాల్లో రూ.36.5 కోట్లు జమ చేశాం.

ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం

జిల్లాలో వానాకాలం సీజన్‌లో 40,244 ఎకరాల వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయలు, కందులు సాగు చేయించాం. 2,300 ఎకరాల ఆయిల్‌పామ్‌ సాగును లక్ష్యంగా నిర్ణయించి, ఇప్పటి వరకు 786 మంది రైతులకు 1,429 ఎకరాలకు పరిపాలన అనుమతులు ఇచ్చాం. మరో 148 ఎకరాలకు 60 మంది రైతులకు రాయితీ ద్వారా బిందుసేద్యం పరికరాలు ఇచ్చాం. ఽయాసంగిలో 30 కొనుగోలు కేంద్రాల ద్వారా 5,750 మంది రైతుల నుంచి 30,228 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాం. రూ.72.20 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేవాం.

34.54 లక్షల మొక్కలు నాటుతాం

వనమహోత్సవంలో భాగంగా 34.54 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. నెలాఖరులోగా లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. ఆరు యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూళ్లు నిర్మించబోతున్నాం. కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీలో భాగంగా ఆరు సమీకృత పాఠశాలల కాంప్లెక్స్‌ల నిర్మాణం, 3 పాఠశాలల అప్‌గ్రేడేషన్‌ కోసం రూ.335.51 కోట్లు మంజూరు చేశాం. శాంతి భద్రతల పరిరక్షణ సహా పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు ఫ్యూచర్‌సిటీ పోలీసు కమిషనరేట్‌ను ఏర్పాటు చేశాం. సుస్థిర ఆర్థిక వృద్ధి, ప్రపంచస్థాయి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఇది తోడ్పతుంది అని మంత్రి వివరించారు. అనంతరం విధినిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన పలువురు అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో చేవెళ్ల, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి, కలెక్టర్‌ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, కిరణ్మయి, డీఆర్‌ఓ శారదాదేవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దేశంలోనే ముందువరుసలో జిల్లా

ఆకట్టుకున్న ‘ఫైర్‌ ఫైటర్‌ రోబో’

వేడుకల్లో భాగంగా వివిధ శాఖలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ స్టాళ్లు, శకటాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అగ్నిమాపకశాఖ ప్రదర్శించిన ‘ఫైర్‌ ఫైటర్‌ రోబో’ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆయా శాఖల ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి తిలకించారు. ఆయా పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం అలరించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement