సాక్షి, సిటీబ్యూరో: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పురాతన వాహనాలు కొలువుదీరాయి. ఈ అరుదైన వింటేజ్ ర్యాలీకి చిరాగ్ అలీ లేన్ వేదికగా నిలిచింది. కార్లు, ద్విచక్ర వాహనాల ప్రత్యేక ప్రదర్శన ఆకర్షించింది. వింటేజ్ సేకరణకర్త కెప్టెన్ కేఎఫ్ పెస్టన్‌జీ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ జరిగింది. స్వాతంత్ర స్ఫూర్తిని గుర్తు చేస్తూ గత కాలపు గొప్పదనాన్ని కళ్లకు కట్టింది. ప్రదర్శనకు వాహన ప్రియులు, కుటుంబాలతో కలిసి భారీగా తరలివ చ్చారు. 1915లో తయారైన అరుదైన హార్లీ డేవిడ్సన్ బైక్ అందరి దృష్టిని ఆకర్షించింది. 110 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన బైక్‌లు, కార్లు అబ్బురపర్చాయి. 1919 మోడల్ ఫియట్ కార్ల నుంచి 1975 వరకు వివిధ దశాబ్దాలకు చెందిన క్లాసిక్ కార్లను ఒకే వేదికపై ప్రదర్శనకు ఉంచారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వినియోగించిన బైక్‌ను కూడా పెస్టన్ జీ అందించడం గమనార్హం.


