ఇబ్రహీంపట్నం: ప్రత్యేక సమగ్ర సవరణ ఓటర్ జాబితాకు (సర్) గడువు సోమవారంతో ముగియనుంది. జూన్ 25 నుంచి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ మొదలుపెట్టగా ఫారాలు పూరించి ఇచ్చేందుకు రెండు దఫాలు గడువు పెంచిన సంగతి తెలిసిందే. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 3,44,584 ఓటర్లు, 359 పోలింగ్ కేంద్రాలు ఉండగా సర్ ప్రక్రియ కోసం 359 బీఎల్‌వోలు, 39 మంది సూపర్‌వైజర్లు, ఏడుగురు ఏఈఆర్వోలను ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. ఆదివారం మధ్యాహ్నం వరకు 2,57,627 మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలను నింపి బీఎల్‌వోలకు అందజేశారు.
ఎక్కడ ఎంత శాతం అంటే..
యాచారం మండలంలో 84.8 శాతం, మంచాల మండలంలో 89.4, ఇబ్రహీంపట్నం రూరల్ 90.6, అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలో 76.9, ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలో 71.6, ఆదిభట్ల సర్కిల్–15 పరిధిలో 64.6, పెద్ద అంబర్‌పేట సర్కిల్ 11 పరిధిలో 65.7 శాతంతో నియోజకవర్గంలో 74.8 శాతం ప్రక్రియ పూర్తి చేసుకుంది. మ్యాపింగ్ కానివి 17,675, అన్ కలెక్టబుల్‌గా 77,814 ఓటర్లు ఉన్నారు. చనిపోయిన, స్థానికంగాలేని, అడ్రసు దొరకని శాశ్వతంగా వెళ్లిపోయిన ఓటర్లు 14,603 మంది ఉన్నారు. 42,246 మంది ఓట్లు ఇతర ప్రాంతాల్లో సైతం ఉండటంతో వారు తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలు బీఎల్‌వోలకు దాఖలు చేసే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.
పల్లెలకే ప్రాధాన్యత
సర్ ప్రక్రియతో రెండు చోట్ల ఓట్లున్న వారు ఏదో ఒకచోట ఓటును పొందే అవకాశం ఉంటుంది. పట్టణాల్లో ఉండే ఓటర్లు ఎక్కువ శాతం స్వగ్రామాలకే మొగ్గు చూపారు. దీంతో అర్బన్ ప్రాంతాల్లో ఓట్ల శాతం తక్కువగా నమోదైంది. మరోసారి గడువు పొడిగించే అవకాశాలు లేకపోవచ్చని అధికారవర్గాలు అంటున్నాయి. సోమవారంతో గడువు ముగుస్తుండడంతో ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇవ్వని ఓటర్లను బీఎల్‌వోలు సంప్రదించనున్నారు.
సరిచేసుకునే అవకాశం
ఈ నెల ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించినప్పటి నుంచి సెప్టెంబర్ 16 వరకు జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, అక్టోబర్ 15 వరకు జాబితా వివరాల్లో తేడాలు కలిగిన ఓటర్లకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచి సమస్యను పరిష్కరించనున్నారు. ఈసీ నిర్దేశించిన 11 రకాల పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని రుజువుగా చూపించి ఓటు ఉండేలా సరిచేసుకోవచ్చు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు పేరు జాబితా నుంచి తొలగిపోవద్దని, అనర్హత కలిగిన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండొద్దని అధికారులు కసరత్తు చేస్తున్నారు.
పోలింగ్ కేంద్రాలపై దృష్టి
ఒక పోలింగ్ స్టేషన్‌లో 1,200 మంది ఓటర్ల కంటే ఎక్కువగా ఉంటే ఆ ఓట్లను పక్క పోలింగ్ బూత్‌లోకి మార్చడం, అవసరమైతే కొత్త పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసే అంశంపై ఎన్నికల అధికారులు దృష్టి సారించారు. పోలింగ్ కేంద్రాల పేరు మార్పు, స్థల మార్పు, కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, విలీనం అంశాలపై పరిశీలిస్తున్నారు.
వేలల్లో ఓట్లు తగ్గే అవకాశం
నియోజకవర్గంలో డబుల్ ఓట్లు, అడ్రసు దొరకని, చనిపోయిన, శాశ్వతంగా వెళ్లిపోయిన వారి ఓట్లను తొలగిస్తే సుమారు 60 వేలకుపైగా ఓట్లు తగ్గే అవకాశం ఉందని పరిశీలకులంటున్నారు. నగరానికి అతి సమీపంలో ఉన్న ఈ నియోజకవర్గంలో వేర్వేరు ప్రాంతాల వారు ఉద్యోగ, ఉపాధి రీత్యా ఇక్కడ స్థిరపడ్డారు. ఏదో ఒకచోట ఓటు హక్కు ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ముగియనున్న సమగ్ర ఓటరు జాబితా సవరణ గడువు
ఇప్పటికే రెండు దఫాలు గడువు పెంపు
‘పట్నం’ నియోజకవర్గంలో 74.8 శాతం ప్రక్రియ పూర్తి
స్వగ్రామాలవైపే అధికశాతం ఓటర్ల మొగ్గు
అర్బన్ ప్రాంతాల్లో తగ్గిన ఓట్ల శాతం


