● లేదంటే గ్యాస్ బండ రావడం కష్టమే
● గ్రేటర్‌లో లక్షల మంది దూరంగానే..
● గడువు మరో వారం రోజులే
● ఎస్‌ఎంఎస్‌లు పంపుతున్న సంస్థలు
సాక్షి, సిటీబ్యూరో: పంజాగుట్టకు చెందిన సుమతి గత నెల 25న ఆన్‌లైన్‌లో ఎల్పీజీ సిలిండర్ బుక్ చేశారు. 15 రోజులైనా రాలేదు. ఈ– కేవైసీ పూర్తి చేయకపోవడంతో డెలివరీ నిలిపివేసినట్లు తెలిసింది. వెంటనే ఏజెన్సీకి వెళ్లి ఈ–కేవైసీ చేసుకోవడంతో మరుసటి రోజే సిలిండర్ వచ్చింది. ప్రస్తుతం నగరంలో చాలామంది వినియోగదారులు ఈ–కేవైసీ ప్రక్రియతో ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ నెల 16లోగా ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ పూర్తి చేసుకోవాలని చమురు మార్కెటింగ్ కంపెనీలు గడువు విధించాయి. ఇండియన్ ఆయిల్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ కంపెనీలు నేరుగా వినియోగదారులకు ఎస్‌ఎంఎస్‌లు పంపిస్తున్నాయి. గడువు మించితే సిలిండర్లు అందవని స్పష్టం చేశాయి. నేరుగా ఏజెన్సీ వద్ద, యాప్‌ల ద్వారా మొబైల్‌లో లేదా ఇంట్లోనే బయోమెట్రిక్ ద్వారానూ ఈ–కేవైసీ చేసుకునే వెసులుబాటు ఉంది. కానీ మహా నగరంలో ఇంకా లక్షలాది మంది ఈ పని చేయలేదు. కాగా.. కంపెనీల అధికారిక యాప్‌లు, వెబ్‌సైట్‌ల ద్వారానే ఈ–కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నాయి. ఆధార్, ఓటీపీలు ఎవరితోనూ పంచుకో వద్దని హెచ్చరిస్తున్నాయి.
ఈ– కేవైసీ చేసుకునేదిలా..
ఇండియన్ ఆయిల్ (ఇండేన్): ప్లేస్టోర్ నుంచి ‘ఇండియన్ ఆయిల్ వన్ ఆధార్ ఫేస్ ఆర్డీ’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. లింక్ అయిన ఫోన్ నంబరు, మెయిల్‌తో పాస్‌వర్డ్ క్రియేట్ చేసి లాగిన్ అవ్వాలి. మొదటిసారి యూజర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. గ్యాస్ క్యాష్ మెమో లేదా సబ్‌స్క్రిప్షన్ ఓచర్‌పై ఉన్న 16 అంకెల ఎల్పీజీ ఐడీని లింక్ చేయాలి. అందులో కస్టమర్ వివరాలు కనిపిస్తాయి. లాగిన్ అయ్యాక హోమ్ పేజీలో ప్రొఫైల్‌పై క్లిక్ చేస్తే ఆధార్ లింక్ అండ్ ఈ–కేవైసీ స్టేటస్ కనిపిస్తుంది. పచ్చ రంగు టిక్ మార్క్ ఉంటే మీ కేవైసీ పూర్తయినట్లు. కాకపోతే అక్కడే రీ–అథెంటికేషన్ బటన్ నొక్కి మీ ముఖాన్ని స్కాన్ చేసి బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ఒకవేళ మీ ఆధార్ బయోమెట్రిక్ లాక్ అయి ఉంటే మొదట దాన్ని అన్‌లాక్ చేయాలి.
భారత్ గ్యాస్: ప్లేస్టోర్ నుంచి ‘హలో బీపీసీఎల్ ఆధార్ ఫేస్ ఆర్డీ’ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. రిజిస్టర్డ్ మొబైల్ నంబరుతో ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేసి లాగిన్ కావాలి. యాప్ హోమ్ పేజీలోనే ఈ–కేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేసి మరోసారి ఓటీపీ వెరిఫై చేసుకోవాలి. అనంతరం ప్రాసెస్‌కు సూచనలు చేస్తుంది. వాటిని పాటించాలి.
హెచ్‌పీ గ్యాస్ : ప్లేస్టోర్ నుంచి ‘హెచ్‌పీ పే’తో పాటు ‘ఆధార్ ఫేస్ ఆర్డీ’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్ తెరిచాక రిజిస్టర్డ్‌పై క్లిక్ చేసి అకౌంట్ లింకింగ్ కోసం మొబైల్ నంబరు నమోదు చేయాలి. ఓటీపీ వెరిఫై చేసి లాగిన్ కావాలి. హోమ్ పేజీలో ‘మై హెచ్‌పీ గ్యాస్’ సెక్షన్‌కు వెళ్లి ‘ఎల్పీజీ’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ ఈ–కేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి స్క్రీన్‌పై కనిపించే సూచనలు పాటించాలి. అనంతరం కెమెరా ఫేస్‌పై క్లిక్ చేస్తే కొన్ని సూచనలు చేస్తుంది. ముఖాన్ని స్కాన్ చేస్తే ఈ–కేవైసీ పూర్తవుతుంది.


