కొత్తూరు: ఓ కార్మికుడి మొబైల్ ఫోన్ చోరీ చేయడమే కాకుండా ఫోన్ అన్‌లాక్ చేసి ఆన్‌లైన్‌లో నగదు అపహరించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలో నివాసం ఉంటున్న లింగాల జగన్‌గౌడ్ గత నెల 21న విధులు నిర్వర్తించే పరిశ్రమకు వెళ్లేందుకు కొత్తూరు బస్టాండ్‌లో బస్సు ఎక్కే క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి అతడి సెల్‌ఫోన్ దొంగిలించాడు. అనంతరం గత నెల 23 నుంచి 26వ తేదీ వరకు సుమారు రూ.1.55 లక్షలు ఆయా అకౌంట్లు, ఆన్‌లైన్ ద్వారా బదిలీ చేసుకున్నాడు. ఆలస్యంగా విషయం గుర్తించిన బాధితుడు ఆదివారం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
యాచారం: నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారిపై తక్కళ్లపల్లి గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వార్డు సభ్యుడు మృతి చెందారు. వివరాలివీ.. కొత్తపల్లి గ్రామ పంచాయతీ పదో వార్డు సభ్యుడు పొలె శివ (40) ఆదివారం సాయంత్రం యాచారం నుంచి స్కూటీపై స్వగ్రామానికి వెళ్తున్నాడు. తక్కళ్లపల్లి గేట్ వద్ద రోడ్డు దాటుతుండగా మాల్ వైపు నుంచి అతి వేగంగా వెళ్తున్న బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శివను ఇబ్రహీంపట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య మమత, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ప్రమాదానికి కారకులైన వారు మాడ్గుల మండల కేంద్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపారు.
గాంధీ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో ఘటన
గాంధీఆస్పత్రి: నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడి కార్మికుడు మృతి చెందినట్లు చిలకలగూడ పోలీసులు తెలిపారు. గాంధీ మెడికల్ కాలేజీ హాస్టల్ భవన నిర్మాణ పనుల్లో బీహార్ రాష్ట్రం ముజఫరాపూర్, పరూఖస్బాతొల గ్రామానికి చెందిన మహ్మద్ ముస్తాఫా(44) కార్మికుడు. శనివారం సాయంత్రం వర్షం పడుతున్న సమయంలో క్రేన్ మోటార్లు తడిసిపోకుండా ఉండేందుకు ప్లాస్టిక్ పరదా తీసుకుని ఏడో అంతస్థుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి తీవ్ర గాయాల పాలయ్యాడు. తోటి కార్మికులు గాంధీ ఆస్పత్రి అత్యవసర విభాగానికి తీసుకువెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి భార్య షెహనాజ్ ఖాతూన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆదివారంపోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి కాంట్రాక్టు సంస్థ నష్టపరిహారం చెల్లించి అన్నివిధాలా ఆదుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.
ఓయూలో ఘనంగా ఆదివాసీ దినోత్సవం
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. క్యాంపస్‌లో ర్యాలీ చేపట్టి, ఆర్ట్స్ కాలేజీ ఎదుట సంప్రదాయ నృత్యాలు చేశారు. అనంతరం దూరవిద్య కేంద్రం ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి ప్రొ.నాగేశ్వర్‌రావు అధ్యక్షత వహించగా సామాజికవేత్త ప్రొ.హరగోపాల్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందిన ఆదివాసీల జీవితాల్లో మార్పు రాలేదని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో ఆదివాసీ స్టూడెంట్ ఫెరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్, నాయకులు రాంబాబు, రాజశేఖర్, పాపయ్య, వెంకటరమణ, గౌతందొర తదితరులు పాల్గొన్నారు.
సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ మధ్య రైల్వే ఆర్‌పీఎఫ్(రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) బ్యాండ్ బృందం 80వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా ఆదివారం కాచిగూడ రైల్వేస్టేషన్‌లో 12 మంది సభ్యులతో అద్భుతమైన సంగీత ప్రదర్శనను నిర్వహించింది. అనేక దేశభక్తి గీతాలతోపాటు ప్రజాదరణ పొందిన పాటలతో ప్రయాణికులు, ఆహూతులను అలరించింది. కార్యక్రమాన్ని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు అభినందించారు.


