థాయిలాండ్‌ నుంచి ఖుష్‌ఖుషీగా! | - | Sakshi
Sakshi News home page

థాయిలాండ్‌ నుంచి ఖుష్‌ఖుషీగా!

Aug 10 2026 7:20 AM | Updated on Aug 10 2026 7:20 AM

థాయిలాండ్‌ నుంచి ఖుష్‌ఖుషీగా!

ఓజి ఖుష్‌ స్మగ్లింగ్‌కు కేంద్రంగా బ్యాంకాక్‌

సాక్షి, సిటీబ్యూరో: మట్టి అవసరం లేకుండా పెంచే హైడ్రాఫోనిక్‌ గంజాయి ఓజి ఖుష్‌ అక్రమ రవాణా థాయిలాండ్‌ కేంద్రంగా మారింది. బ్యాంకాక్‌ మీదుగా శంషాబాద్‌ విమానాశ్రయానికి ఈ సరుకు చేరుతోంది. ప్రధానంగా రెండు విమానాల ద్వారానే వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 2024 నవంబర్‌ నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు ఆర్‌జీఐఏ విమానాశ్రయంలో వెలుగులోకి వచ్చిన 33 కేసుల్లో... 28 ఉదంతాలకు మూలం థాయిలాండ్‌ అని బయటపడింది. ప్రతి 10 కేసుల్లో ఏడు కేసులు బ్యాంకాక్‌–హైదరాబాద్‌ మధ్య నడిచే రెండు విమానాలకు సంబంధించినవేనని దర్యాప్తులో తేల్చారు. భారత్‌, థాయిల్యాండ్‌లకు చెందిన ఆ రెండు విమాన సర్వీసులను వినియోగించి 22 మంది ట్రాన్స్‌పోర్టర్లు వచ్చినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. దీంతో వాటి ద్వారా రాకపోకలు సాగించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని నిర్ణయించారు. ఈ 22 కేసుల్లో అధికారులు 134.2 కిలోల ఓజి ఖుష్‌ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 33 కేసుల్లో కలిపి 40 మంది నిందితులుగా ఉన్నారు. స్మగ్లర్లు ఈ రెండు విమానాలనే ఎంచుకోవడానికి డైరెక్టు విమానాలు కావడం, అధిక సర్వీసులు ఉండటంతో పాటు వాటి రాకపోకల సమయాలే కారణమని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. స్వదేశీ విమానయాన సంస్థ విమానంలో స్మగ్లింగ్‌ సంబంధించిన కేసులు ఎక్కువగా నమోదు కాగా.. అత్యధిక పరిమాణంలో సరుకు దొరికింది మాత్రం థాయ్‌ల్యాండ్‌ విమానంలోనే. ఈ అంతర్జాతీయ విమానానికి సంబంధించిన 10 కేసుల్లో 77.8 కిలోల గంజాయి స్వాధీనమైంది. సరాసరిన ఒక్కో కేసులో 7.8 కిలోలు లభించినట్‌లైంది. భారత్‌కు చెందిన విమానయాన సంస్థకు చెందిన విమనంలో రవాణా అయిన గంజాయికి సంబంధించిన 12 కేసుల్లో 56.4 కిలోల గంజాయి స్వాధీనం కాగా, ఒక్కో కేసులో సగటున 4.7 కిలోలు లభించినట్లు అయిందని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. గంజా యిని పంపే ముఠాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఒక రోజు పంపాలని భావించిన సరుకును ఒకరికే ఇచ్చి, ఒకే విమానంలో తరలించకుండా వేర్వేరుగా పంపిస్తున్నారు. గత ఏడాది జనవరి 24న తియొట్టిల్‌ అష్రఫ్‌ షౌక్కతలి, మహత్‌ కార్కి అనురాధ, మహత్‌ ఆశ అనే ప్రయాణికుల నుంచి 8.4 కిలోల ఓజి ఖుష్‌ స్వాధీనం చేసుకున్నారు. అదే రోజు మరో కేసులో ముబష్షిర్‌ అబ్బాస్‌ సయ్యద్‌, షబ్బార్‌ రజా రిజ్వీ అనే కొరియర్‌లను థాయ్‌లాండ్‌కు చెందిన అంతర్జాతీయ విమానంలో 13.9 కిలోల సరుకుతో పట్టుకున్నారు. దీని విలువ రూ.13.9 కోట్లుగా అంచనా వేస్తున్నారు. బ్యాంకాక్‌ నుంచి నేరుగానే కాకుండా అబుదాబి, కౌలాలంపూర్‌, హనోయ్‌ మీదుగానూ హైదరాబాద్‌కు ఈ సరుకును చేరుస్తున్నారు. కొన్ని కేసుల్లో హైదరాబాద్‌కు ఓజి గంజాయి చేర్చడానికి ముంబైని ట్రాన్సిట్‌ పాయింట్‌గా ఉపయోగిస్తున్నారు. అధిక శాతం ఓజి ఖుష్‌ను చెక్‌–ఇన్‌ లగేజీలో ప్రత్యేకంగా తయారు చేసిన రహస్య అరలు, వ్యాక్యూమ్‌–సీల్డ్‌ ప్యాకెట్లు లేదా వస్తువుల ప్యాకేజింగ్‌లో దాచినట్లు గుర్తించారు. కార్న్‌ఫ్లేక్స్‌ డబ్బాలు, కుకీ బాక్సులు, ఆహార పదార్థాల ప్యాకెట్లు, దుస్తుల మధ్య గంజాయి ప్యాకెట్లను దాచిపెట్టి తరలిస్తున్నారు. కొరియర్లుగా పిలిచే ఈ ఓజి ట్రాన్స్‌పోర్టర్లకు ప్రధాన సూత్రధారులు ఒక్కో ట్రిక్‌కు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు చెల్లిస్తున్నట్లు గుర్తించామని అధికారులు చెప్తున్నారు.

అక్కడ నుంచే నగరానికి వస్తున్న ఈ గంజాయి

ఆ రెండు విమానాల ద్వారానే అత్యధికం స్మగ్లింగ్‌

నిఘా ముమ్మరం చేసిన కస్టమ్స్‌, డీఆర్‌ఐ టీమ్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement