తుక్కుగూడ: ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందించే ఎన్‌ఎంఎంఎస్ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. నిరుపేదలు ఉన్నత విద్యను చదువుకునేందుకు ఈ ఉపకార వేతనం ఎంతో ఉపయోగపడనుంది. ఆర్థిక కారణాలతో ఉన్నత చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ స్కాలర్ షిప్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రోత్సాహకంగా ఉపకార వేతనం ఇస్తుంది.
అర్హతలు ఇవీ..
● ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష రాసేందుకు ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.
● ఏడో తరగతిలో 55 శాతం మార్కులు సాధించి ఉండాలి.
● తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2.5 లక్షల లోపు ఉండాలి.
● కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి.
● అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకంతో ఫారాలను డీఈఓ కార్యాలయంలో అందజేయాలి.
ఇంటర్ సెకండియర్ వరకు..
ప్రభుత్వ ఎయిడెడ్, మోడల్, గురుకుల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత పొందిన విద్యార్థులకు తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ రెండో సంవత్సరం వరకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఉపకార వేతనం లభిస్తుంది.
ఆన్‌లైన్‌లో పరీక్ష రుసుం
పరీక్షకు ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగ విద్యార్థులు రూ.50 పరీక్ష రుసుం ఆన్‌లైన్‌లో చెల్లించి www.bse.telangana.gov.in లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తుకు ఈనెల14 తేదీ వరకు గడువు ఉంది. అక్టోబర్‌లో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష తెలుగు, ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో రాసే వెసులుబాటు కల్పించారు.
ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం కేంద్రం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) ప్రవేశపెట్టింది. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులను పరీక్ష ద్వారా ఎంపిక చేయనుంది. ఈ మేరకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ప్రతిభ చాటిన వారికి ప్రోత్సాహకంగా ఉపకార వేతనం అందించనుంది.
వెనుకబడిన విద్యార్థులకు ప్రోత్సాహకం
ఎన్‌ఎంఎంఎస్ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ
ఈనెల 14వ తేదీ తుది గడువు.. అక్టోబర్‌లో పరీక్ష
ప్రస్తుతం ఎనిమిదో తరగతి
చదువుతున్న వారు అర్హులు
ఎంపికై న స్టూడెంట్స్‌కు ఏడాదికి రూ.12వేల స్కాలర్‌షిప్


