నెల రోజుల్లో ఎనిమిది నేరాలు! | - | Sakshi
Sakshi News home page

నెల రోజుల్లో ఎనిమిది నేరాలు!

Aug 7 2026 6:28 AM | Updated on Aug 7 2026 6:28 AM

సాక్షి, సిటీబ్యూరో: తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగ దేరంగుల హరిబాబు అలియాస్‌ నాని జూబ్లీహిల్స్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌కు చిక్కాడు. ఇద్దరు అనుచరులు, రిసీవర్‌ సహా నలుగురిని పట్టుకున్న పోలీసులు వీరి నుంచి రూ.12 లక్షలు విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నేరచరితుడైన నాని నెల రోజుల క్రితమే జైలు నుంచి బయటకు వచ్చాడని, ఈ కాలంలో గౌరారం, సంగారెడ్డి టౌన్‌, పోచారం ఐటీ కారిడార్‌, నాగోల్‌, కుషాయిగూడ, మేడిపల్లి, వనస్థలిపురం పోలీసు స్టేషన్ల పరిధిలో ఎనిమిది చోరీలు చేశాడని డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌ రఘునాథ్‌ గురువారం వెల్లడించారు. సూరారంలోని దయానంద కాలనీకి చెందిన నిరుద్యోగి నాని తన సోదరుడైన ఘరానా దొంగ గజను చూసి అదే బాటపట్టాడు. రాత్రి వేళ్లలో కాలనీల్లో తిరుగుతూ తాళం వేసున్న ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని నేరాలు చేసే ఇతడిపై ఇప్పటికే 27 కేసులు నమోదు కాగా... వీటిలో మూడింటిలో వాంటెడ్‌గా ఉన్నాడు. పోలీసులు ఇతడిని ఈ ఏడాది ఏప్రిల్‌లో అరెస్టు చేసి జైలుకు పంపగా... జూన్‌లో బెయిల్‌పై బయటకు వచ్చాడు. సూరారంలోని సంతోష్‌నగర్‌కు చెందిన తన్నీరు సూర్య అలియాస్‌ సూరి (నిరుద్యోగి), నాగోలు మమతనగర్‌ కాలనీకి చెందిన నరాల రాహుల్‌లతో (ఇన్వర్టర్‌ టెక్నీషియన్‌) కలిసి ముఠా కట్టాడు. ఇప్పటికే సూరిపై 13, రాహుల్‌పై మూడు చోరీ కేసులు ఉన్నాయి. జూన్‌ నుంచి జూలై వరకు ఈ త్రయం ఎనిమిది చోట్ల పంజా విసిరింది. నాని తాళం పగులకొట్టి, ఇంట్లోకి వెళ్లి చోరీ చేస్తుంటే మిగిలిన ఇద్దరూ బయట కాపుకాసేవారు. కొన్ని సందర్భాల్లో వీళ్లు కూడా లోపలకు వెళ్లి పాలు పంచుకునే వారు. ఈ చోరీ సొత్తును మౌలాలీ ఆర్టీసీ కాలనీకి చెందిన సబావత్‌ రవికి విక్రయించి ముగ్గురూ పంచుకునే వాళ్లు. ఓసారి నేరం చేసి, చేతిలో డబ్బు పడిన తర్వాత జల్సాలు చేస్తూ ఆ మొత్తం ఖర్చయ్యే వరకు మరో నేరం చేసేవాళ్లు కాదు. జూబ్లీహిల్స్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ యాదేందర్‌ నేతృత్వంలో ఎస్సై డి.రవిరాజ్‌తో కూడిన బృందం రంగంలోకి దిగింది. గురువారం ముగ్గురినీ పట్టుకుని 80 గ్రాముల బంగారం, 258 గ్రాముల వెండి, నాలుగు మొబైల్‌ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలతో పాటు చోరీకి వినియోగించే సెంట్రింగ్‌ రాడ్డు, స్క్రూడ్రైవర్‌ స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం స్థానిక పోలీసుస్టేషన్‌కు అప్పగించారు.

ఘరానా దొంగ హరిబాబు వ్యవహారమిది

రిసీవర్‌ సహా నలుగురి అరెస్టు, సొత్తు స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement