సమస్యలే ఏలు‘బడి’!
మూడు నెలలకోసారి వస్తున్నాయి
నిధుల కేటాయింపు నెలకు ఇలా..
మొయినాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఇస్తామని ఉత్తర్వులు జారీ చేసినా వచ్చింది లేదు. సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా వచ్చే కాంపోజిట్ గ్రాంట్‌కు అదనంగా ఈ నిధులు అందజేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా మినరల్ ఫండ్ ట్రస్టు ద్వారా పాఠశాలలకు మంజూరు కానున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. గత ప్రభుత్వ హయాంలో స్కావెంజర్లను తొలగించడంతో సర్కారు బడుల్లో పారిశుద్ధ్య నిర్వహణ ఇబ్బందికరంగా మారింది.
అమ్మ ఆదర్శ కమిటీల ఖాతాలోకి..
ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన నిధులు అమ్మ ఆదర్శ కమిటీల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం మొదలైనప్పటి నుంచి నిధులు సక్రమంగా జమ చేయడంలేదు. కొన్ని పాఠశాలలకు ఇటీవల మూడు నెలలకు సంబంధించిన మొత్తం జమచేసినట్లు తెలుస్తోంది. నెలనెలా నిధులు సక్రమంగా రాకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణకు ఇబ్బంది తప్పడం లేదని పలువురు ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. ప్రభుత్వం నిధులిస్తామని చెప్పడంతో చాలా పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణకు సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. నిధులు రాకపోవడంతో వారి వేతనాలకు కష్టంగా మారింది. జిల్లాలో మొత్తం 1,300 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 1.60 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 4,500 మంది టీచర్లు విద్యాబోధన చేస్తున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకపోవడంతో వారంతా ఇబ్బందులకు గురవుతున్నారు.
పాఠశాలల్లో చేపట్టే పనులు
● ప్రభుత్వం మంజూరు చేసే ప్రత్యేక నిధులతో పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు శుభ్రం చేయడం.
● నిత్యం పాఠశాల పరిసరాలను శుభ్రం చేయడం. చెత్తా చెదారం తొలగించడం. తరగతి గదులను ఊడ్చడం.
● పాఠశాల ఆవరణలో పిచ్చిమొక్కలు తొలగించడం. నీళ్లు అందించడం.
పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించిన ప్రత్యేక నిధులు మూడు నెలలకోసారి వస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన మూడు నెలల మొత్తం ఇటీవలే అమ్మ ఆదర్శ కమిటీ ఖాతాలో జమయ్యాయి. వాటితో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నాం. వచ్చే నిధులు సరిపోక కొన్ని పాఠశాలల్లో ఇబ్బంది పడుతున్నారు.
– మల్లయ్య, మండల విద్యాధికారి, మొయినాబాద్
రండి.. సర్కారు బడుల్లో చేరండి.. అన్నీ ఉచితమే.. సకల వసతులు కల్పిస్తాం.. ప్రైవేటుకు దీటుగా నాణ్యమైన విద్యాబోధన అందిస్తాం.. అని ప్రభుత్వం ఊదరగొడుతున్నా క్షేత్రస్థాయిలో సౌకర్యాలు కల్పించడం కోసం మాత్రం అంతంతమాత్రంగానే నిధులు విదుల్చుతోంది.. దీంతో అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయులకు పాట్లు తప్పడం లేదు.
సర్కారు స్కూలు.. లేవు పైసలు
పాఠశాలలను వేధిస్తున్న నిధుల కొరత
స్పెషల్ ఫండ్ ఇస్తామని ప్రభుత్వ ఉత్తర్వులు
మూడు, నాలుగు నెలలకోసారి కూడా అందని వైనం
అస్తవ్యస్తంగా పారిశుద్ధ్య నిర్వహణ
విద్యార్థుల సంఖ్య నిధులు
1 – 31 రూ.3 వేలు
31–100 రూ.6 వేలు
101–250 రూ.8 వేలు
251–500 రూ.12 వేలు
501–750 రూ.15 వేలు
750 పైన రూ.20 వేలు


