రేవంత్‌రెడ్డివి మూర్ఖపు మాటలు | - | Sakshi
Sakshi News home page

రేవంత్‌రెడ్డివి మూర్ఖపు మాటలు

Dec 28 2025 12:47 PM | Updated on Dec 28 2025 12:47 PM

రేవంత్‌రెడ్డివి మూర్ఖపు మాటలు

రేవంత్‌రెడ్డివి మూర్ఖపు మాటలు

వికారాబాద్‌: రేవంత్‌రెడ్డి మూర్ఖపు మాటలు సీఎం పదవికే కళంకం(మచ్చ) తెచ్చి పెడుతున్నారని మాజీ మంత్రి సబితారెడ్డి అన్నారు. శనివారం వికారాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌ ఒక్కసారి బయటికి వచ్చి మాట్లాడితేనే సీఎం తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. గోదావరి, కృష్ణా బేసిన్లలో ప్రాజెక్టులు నిర్మించి సాగునీరు ఇవ్వాలనే ప్రణాళికతో కేసీఆర్‌ ముందుకెళ్లారని తెలిపారు. ఇందులో భాగంగానే కాళేశ్వరం పూర్తి చేసి, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలకు రూ.35 వేల కోట్లు కేటాయించారని, రూ.27 వేల కోట్లతో తొంభైశాతం పనులు పూర్తి చేశారని వివరించారు. మిగిలిన పది శాతం పనులు పూర్తి చేసి ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలకు నీళ్లివ్వడానికి ఇబ్బందేంటని ప్రశ్నించారు. కేసీఆర్‌ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే రేవంత్‌రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పాలమూరు పథకానికి 90 టీఎంసీల వాటర్‌ కేటాయిస్తే 45 టీఎంసీలే సరిపోతాయనడం ఏమిటని ప్రశ్నించారు.

ఆ టెండర్లు ఎందుకు రద్దు చేశారు?

బీఆర్‌ఎస్‌ హయాంలో ఉద్దండాపూర్‌ రిజర్వాయర్‌కు రూ.7 వేల కోట్లతో టెండర్లు పిలిస్తే సీఎం ఎందుకు రద్దు చేశారో ప్రజలకు చెప్పాలని సబితారెడ్డి డిమాండ్‌ చేశారు. రేవంత్‌రెడ్డి కొడంగల్‌కు మాత్రమే సీఎంలా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అటు వెళ్లి పాలమూరు బిడ్డను అంటాడు.. ఇటు వికారాబాద్‌ వచ్చి జిల్లా వాసిని అంటాడు.. కానీ రెండు ప్రాంతాలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరానికి మరమ్మతులు, పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు.

పాలమూరుకు తీవ్ర అన్యాయం

పాలమూరు పథకాన్ని పక్కకు పడేసిన ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆరోపించారు. పాలమూరు పథకాన్ని పూర్తి చేయకపోతే ఉద్యమం తప్పదని పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, కేసీఆర్‌ కాలి గోటికి కూడా రేవంత్‌రెడ్డి సరిపోడని కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి విమర్శించారు. కార్యక్రమంలో బీసీ కమిషన్‌ మాజీ సభ్యులు శుభప్రద్‌పటేల్‌, జెడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ విజయ్‌కుమార్‌, పరిగి మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ అశోక్‌, క్యామ మల్లేశ్‌, నాయకులు ప్రవీణ్‌రెడ్డి, ఆంజనేయులు, సురేందర్‌, భాస్కర్‌, గోపాల్‌, అనంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆయన వ్యాఖ్యలు సీఎం పదవికే కళంకం

బీఆర్‌ఎస్‌ హయాంలోనే ‘పాలమూరు‘ 90శాతం పూర్తి

మిగిలిన పది శాతం పూర్తి చేసి నీళ్లివ్వడానికి ఇబ్బందేంటి?

సమాధానం చెప్పలేక కేసీఆర్‌పై విమర్శలా..?

మాజీ మంత్రి సబితారెడ్డి ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement