పరిగి: అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని రంగంపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పద్మమ్మ(65) భర్త ఏఎస్సైగా రిటైరై, అనారోగ్యంతో మృతిచెందారు. ఉన్న ఒక్క కుమారుడు కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఇంట్లో పద్మమ్మ ఒంటరిగా ఉంటోంది. ఇదిలా ఉండగా బుధవారం చుట్టుపక్కల ఇళ్లకు దుర్వాసన రావడంతో పద్మమ్మ ఇంటి వద్దకు వెళ్లి చూడగా మృతిచెంది కనిపించింది. మృతురాలి ఒంటిపై రక్తపు మరకలు, ఛాతిపై గాయాలు ఉండటంతో హత్య జరిగి ఉంటుందని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తంచేశారు. ఈ విషయంపై ఎస్‌ఐ మోహనక్రిష్ణను వివరణ కోరగా హత్య కాదని, మృతి చెంది చాలా రోజులు కావడంతో రక్తం బయటకి వచ్చిందని తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.


