కందుకూరు: మండల పరిధిలోని ఆకులమైలారం మాజీ సర్పంచ్ దేవరశెట్టి నందీశ్వర్(60) అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన 1995 నుంచి 2001 వరకు, 2006 నుంచి 2011 వరకు రెండు పర్యాయాలు సర్పంచ్‌గా సేవలందించారు. ఆయనకు భార్యతో పాటు కుమారై ఉన్నారు. కొంత కాలంగా చిక్సిత పొందుతున్న ఆయన బుధవారం ఉదయం మరణించారు. స్థానిక ఎమ్మెల్యే సబితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్‌తో పాటు వివిధ పార్టీల నాయకులు ఎస్.సురేందర్‌రెడ్డి, ఏనుగు జంగారెడ్డి, బొక్క జంగారెడ్డి, ఎస్.కృష్ణనాయక్, ఈశ్వర్‌గౌడ్, గోపాల్‌రెడ్డి, చిర్ర సాయిలు, మంద సాయిలు, ఆనంద్ తదితరులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబీకులకు సానూభూతి తెలిపారు.
కుంటలో పడి మానసిక దివ్యాంగుడి మృతి
శంకర్‌పల్లి: ప్రమాదవశాత్తు కుంటలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం శంకర్‌పల్లి ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ముదస్సర్ అలీ తెలిపిన ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని బుల్కాపూర్‌కి చెందిన లింగంపల్లి రవీందర్(40) మానసిక దివ్యాంగుడు. ఆయన చిన్ననాటి నుంచి తన సోదరుడు ఈశ్వర్ వద్ద ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన రవీందర్.. బుల్కాపూర్ శివారులోని ఓ కుంటలో ప్రమాదవశాత్తు పడిపోయి మృతి చెందాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తులో ఉంది.
ఇంటింటికీ సీపీఐ
● ప్రభుత్వాల తీరును ఎండ గడతాం
● జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిట్
తాండూరు టౌన్: ఇంటింటికీ సీపీఐ అనే నినాదంతో ఏప్రిల్ ఒకటి నుంచి 10వ తేదీ వరకు ప్రజల ముందుకు వెళ్లనున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిట్ తెలిపారు. బుధవారం తాండూరులో పార్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్యాస్ కష్టాలు రోజు రోజుకూ పెరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్‌పై చేస్తున్న యుద్ధాన్ని సీపీఐ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. యుద్ధోన్మాదులు చేస్తున్న పైశాచిక చర్యల వల్ల అమాయకులు బలవుతున్నారన్నారు. అన్ని దేశాల ప్రజల యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారని, మన దేశ ప్రజలు సైతం వ్యతిరేకించాలని పిలుపు నిచ్చారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనకపడ్డాయని, ఇలాంటి విషయాలన్నింటి గురించి ఇంటింటికీ సిపిఐ కార్యక్రమంలో ప్రజలకు వివరిస్తామన్నారు. సమావేశంలో నాయకులు అనంతయ్య, పీర్‌మహ్మద్, రవీందర్, వెంకటేష్, మునీర్ అహ్మద్, సురేష్, పుష్ప, రాజరేఖర్ బాబు, సుదర్శన్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


