రోడ్డుపాలు చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

రోడ్డుపాలు చేయొద్దు

Apr 2 2026 12:06 PM | Updated on Apr 2 2026 12:06 PM

ఇండస్ట్రియల్‌ పార్క్‌కు భూములివ్వం

తేల్చి చెప్పిన రాపోల్‌ రైతులు

రోడ్డుపై బైఠాయించి నిరసన

పరిగి: ఇండస్ట్రియల్‌ కారిడార్‌కు భూములు ఇచ్చేది లేదని రాపోల్‌ గ్రామ రైతులు తేల్చి చెప్పారు. బుధవారం గ్రామపరిధిలోని పరిగి–షాద్‌నగర్‌ ప్రధాన రహదారిపై కట్టెలు వేసి నిప్పంటించి నిరసన తెలిపారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిగి మండలం రాపో ల్‌, కాళ్లాపూర్‌ గ్రామాల పరిధిలో 1,197 ఎకరాల భూ సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో రెండు గ్రామాల రైతులు ఆందోళన బాట పట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కొని రోడ్డున పడేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మా బాధలు స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డికి పట్టడం లేదన్నారు. రెండు గ్రామాల ప్రజలు పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ వస్తే కష్టాలు తీరుతాయని భావించామని.. కానీ ప్రభుత్వ చర్యలు రైతులను భూస్థాపితం చేసేలా ఉన్నాయన్నారు. ధర్నా కారణంగా పరిగి – షాద్‌నగర్‌ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తేనే ఆందోళన విరమిస్తామని రైతులు చెప్పారు. దీంతో పోలీసులు రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తహసీల్దార్‌ వెంకటేశ్వరి రైతులతో చర్చలు జరిపారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement