‘ఉపాధి హామీ’ నిర్వీర్యానికి కేంద్రం కుట్ర
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
ఇబ్రహీంపట్నం: ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఆరోపించారు. శనివారం స్థానిక పాషనరహరి స్మారక కేంద్రంలో దుబ్బాక రాంచందర్ అధ్యక్షతన పార్టీ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి వీబీ– జీ రామ్ జీ బిల్లు ప్రవేశపెట్టడంతో వ్యవసాయ కార్మికులకు, పేదలకు నష్టం వాటిల్లుతోందని.. తక్షణమే బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కొత్త చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలన్నారు. బీజేపీకి బలహీన వర్గాలపై చిత్తశుద్ధి ఉంటే 9వ షెడ్యూల్‌లో చేర్చి బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేసి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గ్రామాలాభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సామేల్, చంద్రమోహన్, కె.జగన్, కవిత, జగదీశ్, నర్సింహ, కమిటీ సభ్యులు జంగయ్య, శ్రీనివాస్‌రెడ్డి, అంజయ్య, బుగ్గ రాములు, రుద్రకుమార్, కిషన్, పి.జగన్ తదితరులు పాల్గొన్నారు.


