2 వేల ఈవీ చార్జింగ్ స్టేషన్లు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: గ్రేటర్‌లో ఈవీ చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుపై దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ దృష్టి సారించింది. ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికిల్స్ ఎన్హాన్స్‌మెంట్(పీఎంఈ డ్రైవ్) పథకం కింద ఎలక్ట్రిక్ వెహికిల్స్ పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. పెట్రోల్, డీజిల్ వాహనాల కాలుష్యానికి చెక్ పెట్టే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం పీఎంఈ డ్రైవ్‌ను అందుబాటులోకి తెచ్చింది. పది సర్కిళ్ల పరిధిలో మూడు కేటగిరీల్లో మొత్తం 3,484 ఈవీ స్టేషన్లకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తొలివిడతగా ఆరు నెలల్లోగా రెండువేల స్టేషన్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఏ–కేటగిరీ కింద ప్రభుత్వ/ప్రైవేటు ఆఫీసులు, పార్కులు, క్రీడామైదానాలు, ప్రముఖ హోటళ్లు, రెసిడెన్షియల్ కాంప్లెక్సులు, ఆస్పత్రులు, విద్యాసంస్థల్లో ఈవీ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. వీటికి కేంద్రం వంద శాతం రాయితీ ఇస్తుంది. బి–కేటగిరీలో రైల్వేస్టేషన్లు, ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతాలు, జాతీయ రహదారుల వెంట ఏర్పాటు చేసే స్టేషన్లకు 70 నుంచి 80 శాతం రాయితీ, సి–కేటగిరీలో ప్రధాన వీధులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, మాల్స్ వంటి ప్రదేశాల్లో ఏర్పాటు చేసే వాటికి 80 శాతం రాయితీ ఇవ్వనుంది. గ్రేటర్‌లో 1.50 లక్షల ఎలక్ట్రికల్ వాహనాలు తిరుగుతున్నాయి. ఇంకా చాలామంది వాహనదారులు వీటిపట్ల ఆసక్తి చూపుతున్నా ఆశించిన స్థాయిలో ఈవీ చార్జింగ్ స్టేషన్లు లేకపోవడంతో వెనుకడుగు వేస్తున్నారు. ఉన్నవాటిలోనూ నిర్వహణలోపం ఉంది. దీంతో ఆయా వాహనాదారులు ఇళ్లు/ ఆఫీసులోనే చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. అపార్ట్‌మెంట్లలో నివసించేవారికి ఇది ఇబ్బందికరంగా మారింది. సెల్లార్లలో ఈవీ స్టేషన్ల ఏర్పాటుకు అనుమతి లేదు.
గ్రేటర్‌లో ఆరు మాసాల్లో ఏర్పాటుకు ప్రతిపాదనలు


