రాకపోకలకు అడ్డుగా మట్టి దిబ్బలు
బడంగ్‌పేట్: అధికారుల మధ్య సమన్వయలోపం వాహనదారులకు శాపంగా మారింది. రోడ్డు విస్తరణలో భాగంగా పక్కనున్న భారీ వృక్షాలను తరలించి, దాని నుంచి వెలువడిన మట్టి కుప్పలను అక్కడే వదిలేయడంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. బడంగ్‌పేట్ పరిధిలోని నాదర్‌గుల్ నుంచి గాంధీనగర్ వరకు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు. ఇరువైపులా ఉన్న చెట్లను నరికి వేయకుండా ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. దాదాపు 65 భారీ చెట్లను గుర్తించి వాటికి రంగులు వేసి నంబర్లతో మార్కింగ్ వేశారు. నెల రోజుల క్రితం చెట్లను వేళ్లతో సహా పెకిలించి క్రేన్ల సహాయంతో వేరే చోటుకు తరలించారు. అప్పుడు జేసీబీతో వేళ్లతో సహా పెకిలించేందుకు చెట్ల చుట్టూ మట్టిని తవ్వి అలాగే రహదారి పక్కన వదిలేశారు. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఏ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలో తెలియక స్థానికులు అయోమయంలో పడ్డారు. ఇప్పటికై నా స్పందించి మట్టి కుప్పలు తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


