ఏక్.. దో.. తీన్ !
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ)పై చర్చ ఎడ తెగకుండా సాగుతోంది. ఇటీవల శివార్లలోని 27 పురపాలికల విలీనంతో జీహెచ్‌ఎంసీ మొత్తాన్ని ఒకే కార్పొరేషన్‌గా ఉంచుతారని మొదట్లో ప్రచారం జరిగింది. ఈ మేరకు 300 వార్డులతో డీలిమిటేషన్ ప్రక్రియ కూడా జరిగింది. తాజాగా మరో రకమైన చర్చ తెరపైకి వచ్చింది. బృహత్ జీహెచ్‌ఎంసీని రెండు లేదా మూడు కార్పొరేషన్లుగా విభజించనున్నట్లుగా ప్రచారం సాగుతోంది. అందుకు తగ్గట్లుగానే మంత్రివర్గ భేటీ, అధికార పార్టీ నేతల సమావేశాల సందర్భంగా ఈ అంశం చర్చకు వస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి సైతం వివిధ నగరాలను పరిశీలించి ఏ ప్రతిపాదన మనకు అనుకూలమో సూచించాలనడం ఊహాగానాలకు మరింత ఊతమిస్తోంది. ఒకవేళ రెండు లేదా మూడు కార్పొరేషన్లుగా చేయాలనుకుంటే వార్డుల డీ లిమిటేషన్ దశలోనే చేయొచ్చుగా అనే వాదనలున్నప్పటికీ, ప్రస్తుతం జీహెచ్‌ఎంసీకి పాలకమండలి గడువు ముగిశాకే ఆ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందని పట్టణ వ్యవహారాల నిపుణులు పేర్కొంటున్నారు.
రెండా... మూడా?
ప్రస్తుతమున్న జీహెచ్‌ఎంసీని ఒకే కార్పొరేషన్‌గా ఉంచి, కొత్తగా కలిసిన ప్రాంతాన్ని 70–80 వార్డుల చొప్పున మరో రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది. వంద వార్డుల చొప్పున 3 కార్పొరేషన్లుగా విభిజిస్తారనే ప్రచారమూ సాగుతోంది. కోర్ సిటీ(పాత ఎంసీహెచ్) పరిధిలోని వంద వార్డులతో ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి మిగతా వాటిని రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల మాదిరిగా ఏర్పాటు చేస్తారనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.
మూడు కార్పొరేషన్లకు ముగ్గురు కమిషనర్లు.. వారికి పైస్థాయిలో మూడింటికీ కలిపి స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారిని మెగా కార్పొరేషన్ కమిషనర్‌గా నియమిస్తారనే ప్రచారం సాగుతోంది. సదరు అధికారిగా ఎవరిని నియమించవచ్చో కూడా కొందరు చెబుతున్నారు. ఎంఐఎం పార్టీకి అనుకూలంగా ఉండేలా ఒక కార్పొరేషన్ ఏర్పడుతుందనే చర్చ కూడా జరుగుతోంది. ఈ ఊహగానాలకు తెరపడి.. జీహెచ్‌ఎంసీ మెగా కార్పొరేషన్ విభజనపై స్పష్టత రావాలంటే.. ప్రస్తుత పాలకమండలి గడువు ఫిబ్రవరి 10 వరకు ఆగాల్సిందే.
తెరపైకి ‘మెగా కార్పొరేషన్ కమిషనర్’
జీహెచ్‌ఎంసీ పునర్విభజనపై రోజుకో చర్చ
కోర్ సిటీ వరకు 1.. మిగతా భాగం 2 కార్పొరేషన్లుగా విభజన!
పాలకమండలి గడువు ముగిశాకే విభజనపై స్పష్టత


