అప్పు కట్టలేక.. కంటికి కునుకు లేక
యాచారం: చౌదర్‌పల్లి గ్రామ డ్వాక్రా సంఘాల్లో వెలుగులోకి వచ్చిన రూ.లక్షలాది నిధుల స్వాహా పర్వం మళ్లీ మొదటికొచ్చింది. యాచారం ఎస్‌బీఐ నుంచి ఏఏ మహిళలు, డ్వాక్రా సంఘాల పేర్ల మీద రుణాలు వెళ్లాయో.. గుర్తించిన అధికారులు వారందరికీ నోటీసులు పంపిస్తున్నారు. ఒక్కో మహిళ పేరు మీద రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలు, ఒక్కో సంఘం పేరు మీద రూ. 5 లక్షల నుంచి రూ.19 లక్షలకు పైగా రుణాలున్నట్లు గుర్తించి వారం రోజుల వ్యవధిలోనే అప్పు మొత్తం చెల్లించాలని, లేని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో మహిళలు నోటీసులు పట్టుకుని యాచారం ఎస్‌బీఐ, చౌదర్‌పల్లి పంచాయతీ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. తాము తీసుకోనిదే ఎలా చెల్లిస్తామని లబోదిబోమంటున్నారు.
మేనేజరే చెల్లించాలి
సోమవారం సాయంత్రం యాచారం ఎస్‌బీఐకి విచారణ నిమిత్తం బదిలీ అయిన మేనేజర్ ఝాన్సీరాణి వచ్చినట్లు తెలుసుకుని పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆందోళనకు దిగారు. మేనేజర్, ఐకేపీ సిబ్బందే తమ పేర్ల మీద ఉన్న అప్పులు చెల్లించాలని డిమాండ్ చేశారు. మహిళల తిరుగుబాటుతో కన్నీళ్లు పెట్టుకున్న ఝాన్సీరాణి కొందరిని నమ్మి పూర్తిగా మోసపోయానని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఉన్నతాధికారులు కూడా ఫోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి బినామీల పేర్లపై రూ.లక్షలాది నిధులు బదిలీ అయినట్లు గుర్తించారు. బ్యాంకు మేనేజర్ సహకారం లేనిదే నిధుల బదిలీ సాధ్యమయ్యే అవకాశమే లేదని ఎస్‌బీఐ, డీఆర్‌డీఓ ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. బదిలీ అయిన బ్యాంకు మేనేజర్‌తో పాటు మరో నలుగురు బ్యాంకు సిబ్బందిపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఉన్నతాధికారి ఒకరు సాక్షికి తెలిపారు. చౌదర్‌పల్లి పంచాయతీ కార్యాలయానికి మంగళవారం వెళ్లిన మహిళలు నూతన సర్పంచ్, పాలకవర్గానికి ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేసేలా కృషి చేయాలని వేడుకున్నారు.
చట్టపరంగా ముందుకు
డ్వాక్రా సంఘాల మహిళలకు హెచ్చరిక నోటీసులు పంపింది వాస్తవమే. కొంత మంది వచ్చి తాము అప్పు తీసుకోలేదని చెబుతున్నారు. త్వరలో నిజాలన్నీ వెలుగులోకి వస్తాయి. ఎవరి పేర్లపై అప్పులున్నాయో.. వారు కచ్చితంగా చెల్లించాల్సిందే. లేదంటే చట్టపరంగా ముందుకెళ్తాం. – మాన్యనాయక్, మేనేజర్, యాచారం ఎస్‌బీఐ
మరింత లోతుగా విచారణ
రూ.3 కోట్ల రుణాలకు సంబంధించి రికార్డులు సక్రమంగా లేవు. డీఆర్‌డీఓ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. బాధ్యులైన వారిపై చర్యలు కూడా తీసుకున్నారు. మరింత లోతుగా విచారణ చేపట్టి మహిళలకు న్యాయం చేసే విధంగా కృషి చేస్తాం.
– రవీందర్, ఐకేపీ ఏపీఎం, యాచారం
డ్వాక్రా సంఘాల మహిళలకు బ్యాంకు నోటీసులు
తీసుకోనివాటికి ఎలా కడతామంటున్న బాధితులు
మళ్లీ మొదటికొచ్చిన నిధుల స్వాహా పర్వం
కంటికి కునుకు లేదు
రూ.15 లక్షల చొప్పున అప్పులున్నట్లు నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందిన నాటి నుంచి కంటికి కునుకు లేదు. మా ఆస్తులు అమ్మినా ఆ అప్పులు చెల్లించే స్థితిలో లేం. అప్పులకు బ్యాంకు మేనేజర్, సిబ్బందే బాధ్యులు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. – కావలి దేవమ్మ, అమీర్‌పేట కొమురమ్మ


