చలికాలం కోడి పైలం
● పౌల్ట్రీల నిర్వహణలో జాగ్రత్తలు తప్పనిసరి
● లేదంటే నష్టాలు వచ్చే ప్రమాదం
షాబాద్: జిల్లాలోని పలువురు రైతులు వ్యవసాయంతో పాటు పౌల్ట్రీరంగాన్ని ఎంచుకుని ఆదాయం పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 3,780 కోళ్ల ఫారాలు ఉన్నాయి. ప్రస్తుతం చలి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. దీనిపై రేగడిదోస్వాడ పశువైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి సలహాలు, సూచనలు..
ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు..
సాధరణంగా కోడి శరీర ఉష్ణోగ్రత 107 డిగ్రీల ఫారన్‌హీట్ ఉంటుంది. అయితే చలికాలంలో ఉష్ణోగ్రత లోపం వల్ల కూడా కోడి పిల్లలపై దుష్ప్రభావం పడుతుంది. అందువల్ల కోళ్లలో గుడ్ల ఉత్పత్తి తగ్గుతుంది.
లిట్టర్ నిర్వహణలో...
● చలి కాలంలో తేమ శాతం ఎక్కువగా ఉండటంతో లిట్టర్ గట్టిపడుతుంది. దీంతో ఈకొలై వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి లిట్టర్‌లో ప్రతీ 100 చదరపు అడుగుల స్థలానికి 5–8 కిలోల పొడిసున్నం లేదా అమ్మోనియం సల్ఫేట్ లేదా ఆరు కిలోల సూపర్ పాస్పేట్ కలపాలి.
● లిట్టర్‌ను తరుచూ కదిలిస్తూ పొడిగా ఉండేలా చూడాలి.
ఆహారం విషయంలో...
● శరీర ఉష్ణోగ్రత కాపాడుకోవడానికి కోళ్లు చలి కాలంలో దాణా ఎక్కువగా తీసుకుంటాయి. ఉష్ణోగ్రత తగ్గితే మేత వినియోగం 1.5 శాతం పెరుగుతుంది. మేత ఎక్కువగా తీసుకుంటున్నాయని దాణా తగ్గిస్తే ఉత్పత్తి తగ్గుతుంది. కాబట్టి దాణా తగ్గించకుండా పోషకాలను సరిచేయాలి.
● తేమవల్ల నిల్వ ఉంచిన దాణా ముడిపదార్థాల్లో శిలీంద్రాలు వృద్ధి చెందుతాయి. తేమ 9శాతానికి మించితే అప్లోటాక్సిన్ సమస్య ఏర్పడుతుంది. దీని నివారణకు దాణాలో ఈస్టు కల్చర్ బైండర్సన్ రెండు కిలోల చొప్పున కలిపి అందించాలి.
బ్రూడింగ్ విషయంలో...
● చలికాలంలో బ్రూడింగ్ నిర్వహణపై అత్యంత శ్రద్ధ వహించాలి.
● కోడి పిల్లలు మొదటి వారంలో 90– 95 డిగ్రీలు ఫారన్ హీట్, ఆ తర్వాత ప్రతీ వారానికి 5 డిగ్రీల ఫారన్ హీట్ చొప్పున తగ్గిస్తూ ఆరో వారానికి 70 డిగ్రీల ఫారన్‌హీట్ ఉండేలా చూసుకోవాలి.
● కేజ్ సిస్టమ్‌లో అయితే బ్రూగింగ్ షెడ్డు ఉష్ణోగ్రత 85 డిగ్రీల ఫారన్ హీట్, 25 శాతం తేమ ఉండే విధంగా చూడాలి.
ఫారాల నిర్వహణలో...
● కోళ్లు చలిబారిన పడకుండా షెడ్ల చుట్టూ పరదాలు కట్టాలి. తగినంత వెచ్చదనం కోసం 16 గంటల పాటు లైటింగ్ ఏర్పాటు చేయాలి.
● షెడ్ల చుట్టూ పది అడుగుల దూరం వరకు పిచ్చి మొక్కలు, పొదలు తొలగించాలి.
● వంద అడుగుల కంటే ఎక్కువ పొడవుగా ఉండే ఫారాల్లో తాత్కలికంగా పార్టీషన్లు ఏర్పాటు చేసుకోవాలి.
● కోడి పిల్లలను కిక్కిరిసి ఉంచితే శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి సరిపోయే స్థలం కేటాయించాలి.
రక్షణ చర్యలు తప్పనిసరి
చలికాలంలో పౌల్ట్రీ ఫారమ్‌లో నష్టాలు వాటిల్లకుండా రైతులు రక్షణ చర్యలు పాటించాలి. కోళ్ల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఏవైనా సమస్యలు ఎదురైతే పశువైద్యాధికారులను సంప్రదించాలి.
– చంద్రశేఖర్‌రెడ్డి, రేగడిదోస్వాడ పశువైద్యాధికారి


