‘ఫేక్‌’ ఓసీలపై డిస్కం గురి! | - | Sakshi
Sakshi News home page

‘ఫేక్‌’ ఓసీలపై డిస్కం గురి!

Dec 22 2025 9:02 AM | Updated on Dec 22 2025 9:02 AM

‘ఫేక్‌’ ఓసీలపై డిస్కం గురి!

‘ఫేక్‌’ ఓసీలపై డిస్కం గురి!

● డిస్కం కళ్లుగప్పి..కనెక్షన్ల కోసం దరఖాస్తు ● ఇప్పటికే 40పైగా ఫేక్‌ ఓసీలు, కోర్టు ఆర్డర్ల గుర్తింపు ● దరఖాస్తుదారులపై కేసుల నమోదుకు సిఫార్సు ● 56 మంది ఇంజినీర్లపై వేటుకు రంగం సిద్ధం

సాక్షి, రంగారెడ్డి జిల్లా: నకిలీ కోర్టు ఆర్డర్లు, ఫేక్‌ ఆక్యుపెన్సీ(ఓసీ) సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాలతో డిస్కంను బురిడీ కొట్టిస్తున్న కాంట్రాక్టర్లు సహా కళ్లుమూసుకుని కనెక్షన్లు జారీ చేసిన ఇంజినీర్లపై చర్యలకు రంగం సిద్ధమెంది. ఇప్పటికే గ్రేటర్‌ జిల్లాల పరిధిలో 40పైగా ఫేక్‌ ఓసీలను గుర్తించినట్లు తెలిసింది. తప్పుడు పత్రాలతో డిస్కంను తప్పుదారి పట్టించిన కాంట్రాక్టర్లు/ భవన యజమానులపైనే కాదు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇందుకు సహకరించిన ఇంజినీర్ల పై కూడా చర్యలకు సిద్ధమవడంతో ఆయా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

కాంట్రాక్టర్లతో కుమ్మకై ్క..గుట్టుగా మీటర్లు జారీ

గ్రేటర్‌లో హైరైజ్‌ భవనాలు, గెటెడ్‌ కమ్యూనిటీలు పుట్టుకొస్తున్నాయి. విద్యుత్‌ అధికారులు ముందు వీటికి తాత్కాలిక కనెక్షన్లు జారీ చేస్తుంటారు. ఆ తర్వాత డిమాండ్‌ను బట్టి అంచనాలను రూపొంది స్తుంటారు. విద్యుత్‌ లోడ్‌ 25 కిలోవాట్లకు మించి ఉన్న భవనాలకు వారు ఆశించిన సంఖ్యలోని మీటర్లు జారీ చేయాలంటే.. దరఖాస్తు సమయంలోనే బిల్డింగ్‌ పర్మిషన్‌, ఆక్యూపెన్సీ సర్టిఫికెట్‌, సీఈఐజీ నిరంభ్యంతర పత్రం సమర్పించాల్సి ఉంది. అయితే వీటిలో కొన్ని నిర్మాణాలు చెరువుశిఖం, బఫర్‌ జోన్‌, గ్రామ కంఠం భూముల్లో ఉంటుండగా, మరికొన్ని జీ+2 అనుమతులు పొంది, అంతకు మించి అంతస్తులు నిర్మిస్తున్నారు. ఇలాంటి వాటికి మున్సిపాలిటీ ఓసీ రిలీజ్‌ చేయదు. నాసిరకం విద్యుత్‌ పనులు చేసిన భవనాలకు సీఈఐజీ కూడా ఎన్‌ఓసీ జారీ చేయదు. ఎలాగైనా ఆ భవనానికి విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకోవాలని భావించిన కొంత మంది అడ్డదారులు తొక్కుతున్నారు. ఫేక్‌ బిల్డింగ్‌ పర్మిషన్లు, ఫేక్‌ ఓసీలతో పాటు సీఈఐజీ సంతకాలను ఫోర్జరీ చేసిన పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. తీరా డిస్కం ఉన్నతాధికారులు టీఎస్‌ బీపాస్‌, జీహెచ్‌ఎంసీ పోర్టల్స్‌ను ఓపెన్‌ చేసి చెక్‌ చేయగా అసలు విషయం బయటపడుతోంది. దరఖాస్తుదారులు సమర్పించిన పత్రాలను పరిశీలించకుండా గుడ్డిగా కనెక్షన్లు మంజూరు చేసిన 56 మంది ఇంజనీర్లపై చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

‘మార్తాండనగర్‌ సర్వే నంబర్‌ 80లోని 200 గజాల స్థలంలో ఓ మహిళ మల్టీ స్టోరేజ్‌ భవనం నిర్మించి, మీటర్ల కోసం దరఖాస్తు చేసుకుంది. దరఖాస్తుతో పాటు కోర్టు ఆర్డర్‌ కాపీ జత చేసింది. తీరా అనుమానం వచ్చి ఆరా తీస్తే...ఏకంగా కోర్టు ఆర్డరే ఫేక్‌ అని తేలింది. అదేవిధంగా నల్లగండలో ఓ నిర్మాణ సంస్థ మల్టీ స్టోరేజ్‌ భవనాన్ని నిర్మించింది. 5.5 లక్షల వాట్స్‌ డిమాండ్‌ ఉన్నట్లు గుర్తించి, 11 మీటర్లకు దరఖాస్తు చేసింది. నకిలీ అనుమతి పత్రాలు చూపించి, కనెక్షన్లు పొందినట్లు గుర్తించింది’

‘వనస్థలిపురంలోని ద్వారకానగర్‌ రోడ్‌ నంబర్‌ 10లో ఓ మల్టీస్టోరేజ్‌ భవన యజమాని, తను పొందిన ఏడు విద్యుత్‌ మీటర్లను కేటగిరీ ఎల్టీ–3 నుంచి కేటగిరీ ఎల్టీ–1కు మార్చాల్సిందిగా కోరుతూ ఇటీవల డిస్కంకు దరఖాస్తు చేసింది. డిస్కం కమర్షియల్‌ విభాగం ఉన్నతాధికారులకు అనుమానం వచ్చి ఆరా తీయగా, ఫేక్‌ బిల్డింగ్‌ పర్మిషన్‌, ఫేక్‌ ఓసీలను సమర్పించినట్లు తేలింది. ఇందులో ప్రమేయమున్న వారందరిపై కేసు నమోదుకు రంగం సిద్ధమైంది’

‘ఓ నిర్మాణ సంస్థ పీర్జాదిగూడ సెక్షన్‌ శంకర్‌నగర్‌ సర్వే నంబర్‌ 53/పార్ట్‌లోని ఓ బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించింది. 1.50 లక్షల వాట్స్‌ కాంటాక్ట్‌ లోడ్‌ అవసరమని గుర్తించి, ఆ మేరకు 30 విద్యుత్‌ మీటర్లకు దరఖాస్తు చేసుకుంది. నకిలీ ఆక్యూపెన్సీ(ఓసీ) సర్టిఫికెట్‌ను అప్‌లోడ్‌ చేసి అడ్డంగా దొరికి పోయింది. ఇందులో గుత్తేదారే కీలక సూత్రధారిగా వ్యవహరించినట్లు తేలింది. ఇటు డిస్కంను, అటు యజమానిని మోసం చేసిన గుత్తేదారుపై క్రిమినల్‌ కేసు నమోదుకు సిఫార్సు చేసింది’

సరూర్‌నగర్‌లో తీగలాగితే డిస్కంలో కదిలిన డొంక

సరూర్‌నగర్‌ సర్కిల్‌ పరిధిలో ఓ కాంట్రాక్టర్‌ ఏకంగా సీఈఐజీ సంతకాన్ని ఫోర్జరీ చేసి, కొత్త కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేశాడు. ఇదే అంశంపై ‘ఫేక్‌ ఓసీలు..ఫోర్జరీ’ సంతకాల శీర్షికతో నవంబర్‌ 23న సాక్షిలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని సర్కిళ్లు, సెక్షన్ల వారీగా ఇటీవల మంజూరు చేసిన ఎల్‌టీ, హెచ్‌టీ కనెక్షన్లపై ఆరా తీయగా, 40పైగా దరఖాస్తులు నకిలీగా నిర్ధారణ అయినట్లు తెలిసింది. వీరందరిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement