గాంధీ పేరు పలకడం బీజేపీకి ఇష్టంలేదు
● జాతిపితను రెండోసారి హత్య చేస్తున్నారు
● ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర
● పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
మొయినాబాద్: స్వాతంత్య్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించి, దేశానికి స్వాతంత్య్రం సాధించిపెట్టిన జాతిపిత మహాత్మాగాంధీని హత్యచేసిన గాడ్సే వారసులు ఆయన పేరును తొలగించి రెండోసారి హత్యచేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమా ర్‌గౌడ్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం మున్సిపల్ పరిధిలోని అజీజ్‌నగర్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా గాంధీజీ, రాజీవ్‌గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతలకు గాంధీజీ పేరు పలకడం ఇష్టంలేక ఉపాధి హామీ పథకం పేరు మారు స్తున్నారని మండిపడ్డారు. దేశంలోని పేద ప్రజలకు కనీసం వంద రోజుల పని కల్పించాలనే సంకల్పంతో 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చిందన్నారు. గ్రామస్వరాజ్యం కోసం కలలుగన్న మహాత్మాగాంధీ పేరును ఉపాధి హామీ పథకానికి పెట్టారని గుర్తుచేశారు. గాంధీజీ, నెహ్రూ దేశానికి అందించిన సేవలను ప్రజలకు తెలియనీయకుండా కేంద్రం కుట్రలు చేస్తోందన్నారు. దేశంలో అనేక ప్రాజెక్టులు, పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నెహ్రూ హయాంలోనే నిర్మించారన్నారు. ఈ నిజాలను బీజేపీ నేతలు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటు పరం చేసిందన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చిందో చూపించాలని నిలదీశారు. ప్రజలకు ఉద్యోగ, ఉపాధిని దూరం చేసే కుట్రలో భాగంగానే జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చారన్నారు. మహాత్మాగాంధీ పేరు తొలగించడాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారని, దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. భారత్‌జోడో యాత్రతో రాహుల్‌గాంధీ దేశంలో ఐక్యత సాధించే ప్రయత్నం చేశారన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభివృద్ధి, సంక్షేమంతో ప్రజలకు మరింత దగ్గరవుతున్నారన్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు దాన్ని నిరూపిస్తూ అత్యధికంగా కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించారన్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ వర్కింగ్ కమిటీ సభ్యుడు వంశీచందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, కసిరెడ్డి నారాయణరెడ్డి, రాజ్‌ఠాకూర్, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, చేవెళ్ల నియోజకవర్గ ఇన్‌చార్జి భీంభరత్, రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరీ సతీష్, టీపీసీసీ సభ్యుడు దర్శన్, మండల పార్టీ అధ్యక్షుడు మాణయ్య, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు జ్యోతి, మాజీ జెడ్పీటీసీ కాలె శ్రీకాంత్, సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
షాద్‌నగర్‌రూరల్: ప్రతిరోజు యోగా సాధన చేయడంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఏసీపీ లక్ష్మీనారాయణ అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆదేశాల మేరకు ఆదివారం యోగాసనాలు సాధన చేయించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. యోగాతో అనేక దీర్ఘకాలిక రుగ్మతలకు ఉపశమనం లభిస్తుందని అన్నారు. నిత్యం యోగా సాధనతో రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐ విజయ్‌కుమార్, కేశంపేట సీఐ నరహరి, ఎస్‌ఐలు సుశీల, శ్రీకాంత్, రాంచంద్రయ్య, ప్రణయ్, రాజేశ్వర్, రవీందర్‌నాయక్, విజయ్, పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.


